విప్ ల భర్తీకి కసరత్తు.. జనవరిలో నోటిఫికేషన్!
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ విప్ ల పోస్టులు త్వరలోనే భర్తీ కానున్నాయి. అందుకు సంబంధించిన కసరత్తును అధికారపార్టీ ప్రారంభించింది. జనవరి మొదటివారంలో మండలిని రెండ్రోజుల పాటు నిర్వహించి నియమించనుంది. ఒక రోజు నోటిఫికేషన్, రెండోరోజు ఎన్నిక, ప్రమాణ స్వీకారం చేయించనుంది. శానసమండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా, 36 మంది టీఆర్ఎస్ కు చెందిన వారున్నారు. ఇద్దరు ఎంఐఎం, ఒకరు కాంగ్రెస్, ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఇదిలా […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ విప్ ల పోస్టులు త్వరలోనే భర్తీ కానున్నాయి. అందుకు సంబంధించిన కసరత్తును అధికారపార్టీ ప్రారంభించింది. జనవరి మొదటివారంలో మండలిని రెండ్రోజుల పాటు నిర్వహించి నియమించనుంది. ఒక రోజు నోటిఫికేషన్, రెండోరోజు ఎన్నిక, ప్రమాణ స్వీకారం చేయించనుంది.
శానసమండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా, 36 మంది టీఆర్ఎస్ కు చెందిన వారున్నారు. ఇద్దరు ఎంఐఎం, ఒకరు కాంగ్రెస్, ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఇదిలా ఉంటే మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ తో పాటు మరో నాలుగు ప్రభుత్వ విప్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు కేబినెట్ హోదా ఉండటం, అధికారపార్టీకి చెందినవారికే అవకాశం ఉండటంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి తోడు గవర్నర్, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన వారిలో అధికశాతం మంది సీనియర్లే. గతంలో మంత్రులుగా, స్పీకర్ గా, మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ గా పనిచేసినవారున్నారు. వీరిలో ఎవరికి కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
పదవీకాలం ముగియడంతో…
ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, భాను ప్రసాదరావు, కూచుకుల్ల దామోదర్ రావు, ఎంఎస్ ప్రభాకర్ లను ప్రభుత్వ విప్ లుగా నియామకం అయ్యారు. అందులో ఎంఎస్ ప్రభాకర్ మినహా అందరీ పదవీకాలం ముగియడంతో ఆ పదవులు ఖాళీ అయ్యాయి. ప్రభుత్వ చీఫ్ విప్ గా బోడకుంటి వెంకటేశ్వర్లు పనిచేశారు. ఈయన పదవికాలం సైతం ముగియడంతో ఖాళీ అయ్యింది. వీరిలో భానుప్రసాదరావు, దామోదర్ రెడ్డి లు రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వ చీఫ్ విప్ తో పాటు, మూడు ప్రభుత్వ విప్ పదవులు ఖాళీగా ఉన్నాయి. జనవరి 4న ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి పదవీకాలం సైతం ముగుస్తుండటంతో తిరిగి మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ తో పాటు ప్రభుత్వ విప్ పదవులను నియమించాల్సి ఉంది. రెండ్రోజుల పాటు శాసనమండలిని నిర్వహిస్తారని సమాచారం. ఒకరోజు ఎన్నికకు నోటిఫికేషన్, రెండో రోజు ఎన్నిక, ప్రమాణస్వీకారం చేయిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రెండోసారి ఎన్నికైన భానుప్రసాదరావు, దామోదర్ రెడ్డిలకు మరోసారి అవకాశం కల్పిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే శాసనసభలో, మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న అరుదైన రికార్డును మధుసూదనాచారి సొంతం చేసుకున్నారు. అయితే ఆయనకు ఏ పదవి ఇస్తారనే దానిపై సందిగ్ధం నెలకొంది. తొలిసారి మండలికి ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి, రమణ, తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో పాటు వి. గంగాధర్ గౌడ్ కు సైతం ప్రభుత్వ విప్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఎవరికి కేటాయించాలనే దానిపై ఇప్పటికే పార్టీ అధిష్టానం పలువురి అభిప్రాయాలను స్వీకరించడంతో పాటు కొంతమంది పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ఎవరూ ఊహించని విధంగా బండ ప్రకాశ్ ను ఎమ్మెల్సీని చేయడంతో ఆయనకు ఏ పదవి అప్పగిస్తారనేది ఆసక్తిని పెంచుతోంది.