వైస్‌చైర్మన్ వరించేదెవరినో..!
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ జెడ్పీటీసీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీ వైస్‌చైర్మన్ ఆరె రాజన్న మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్రానుందని, ఫలితాల తరువాత వైస్ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌కు చెరో ఎనిమిది స్థానాలు ఉన్నాయి. సిట్టింగ్ స్థానంలో గెలిస్తేనే జెడ్పీ వైస్ చైర్మన్ పదవి అధికార పార్టీకి దక్కనుంది. దీంతో ఉప ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి సవాల్‌గా […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ జెడ్పీటీసీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీ వైస్‌చైర్మన్ ఆరె రాజన్న మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్రానుందని, ఫలితాల తరువాత వైస్ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌కు చెరో ఎనిమిది స్థానాలు ఉన్నాయి. సిట్టింగ్ స్థానంలో గెలిస్తేనే జెడ్పీ వైస్ చైర్మన్ పదవి అధికార పార్టీకి దక్కనుంది. దీంతో ఉప ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి సవాల్‌గా మారగా.. ప్రతిపక్షాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
ఎన్నికల కోసం అధికారుల ఏర్పాట్లు
రూరల్ జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ జారీ కానుంది. జనవరి నెలాఖరులో, లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎలక్షన్లు నిర్వహించనుంది. జిల్లాలో మొత్తం 17 జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్కు తొమ్మిది, బీజేపీకి ఐదు, కాంగ్రెస్‌కు ముగ్గురు సభ్యులు ఉన్నారు. రాజన్న మృతితో టీఆర్ఎస్ సంఖ్య ఎనిమిదికి తగ్గింది. తిరిగి వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే ఆ పార్టీ కి తొమ్మిది మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. సమాన బలం ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
సీటు చేజారితే మెజార్టీ ఔట్..
ఆదిలాబాద్ రూరల్ అధికార పార్టీ సిట్టింగ్ స్థానంకాగా.. ఓడిపోతే వైస్ చైర్మన్ పదవి చేజారే ప్రమాదం ఉంది. దీంతో ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే టీఆర్ ఎస్ నేతలు వ్యూహాలకు పదను పెడుతున్నారు. మరోవైపు ఈ స్థానంలో గెలిస్తే జెడ్పీ వైస్ చైర్మన్‌పీఠం దక్కించుకోవచ్చని విపక్ష బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నోటిఫికేషన్‌కు ముందే అధికార, విపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్తుతున్నాయి. అధికార పార్టీ ఇప్పటికే ఆరె రాజన్న తనయుడడు ఆరె నరేశ్‌ను పోటీలో దించుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే కాంగ్రెస్తాజాగా కొండ గంగాధర్తమ అభ్యర్థని ప్రకటించింది. బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ తనయుడిని రంగంలోకి దించుతున్నట్లు సమాచారం.
గ్రామాల్లో పర్యటనలు..
మూడు పార్టీల అభ్యర్థులు ఇప్పటికే వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ముఖ్య నాయకులతో పాటు కుల సంఘాలతో భేటీ అవుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఎమ్మెల్యే జోగు రామన్న వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఆరె రాజన్నకు ప్రజల్లో మంచి పేరు.. గ్రామాల్లో పట్టు.. సామాజికంగా బలం ఉండడం కలిసివచ్చే అంశాలని, వీటితో పాటు ప్రభుత్వ పథకాలతో పాటు సానుభూతి కలిసి వస్తుందని టీఆర్ఎస్భావిస్తోంది. ఇక బీజేపీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కుమారుడు శరత్ పేరును ప్రకటించే అవకాశముంది. దీంతో శంకర్ అన్నీ తానై నడిపిస్తున్నారు. ఎలాగైనా విజయం సాధించి జెడ్పీ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహం పన్నుతున్నారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థి గంగాధర్ కూడా ఆరె రాజన్న సామాజికవర్గానికి చెందినవారు కాగా.. వారి ఓట్లు తమకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. ఈ స్థానం గెలుపుపైనే జెడ్పీ వైస్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందో తేలనుంది.
గత ఎన్నికల్లో ఉట్నూరు జెడ్పీటీసీ చారులత రాథోడ్ కాంగ్రెస్ నుంచి గెలుపొందగా.. ఆమెను ఆపార్టీ జెడ్పీ చైర్పర్సన్అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ కు మూడు స్థానాలు మాత్రమే రావడంతో ఆమె జెడ్పీ చైర్పర్సన్కాలేదు. దీంతో జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఆమె టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి రాథోడ్ జనార్దన్, వైస్ చైర్మన్ అభ్యర్థి ఆరె రాజన్న కు మద్దతు ఇచ్చారు. అయితే ఆ సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చినప్పటికీ.. టీఆర్ఎస్లో చేరకుండా నేటికీ కాంగ్రెస్ లోనే కొనసాగుతూనే ఉంది. త్వరలో జరిగే వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తారా లేక.. అధికార పార్టీకి చెందిన అభ్యర్థికి మద్దతిస్తారా.. అనేది కీలకంగా మారింది. మెజారిటీ సమానంగా ఉన్న పక్షంలో ఆమెనే జెడ్పీ వైస్ చైర్మన్ పదవి అడుగుతారా.. మరోసారి అధికార పార్టీకి అండగా ఉంటారా..? విపక్షాల అభ్యర్థికి మద్దతుగా నిలుస్తారా అనేది వేచి చూడాలి.