వరినాట్ల టైమాయే.. యూరియా లేకపాయే!

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : యూరియా బస్తాలు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నాటు వేసే సమయమని యూరియా లేకపోతే ఎలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని సొసైటీలకు ఎరువుల కోసం వెళ్తే స్టాక్ లేదనే సమాధానాలు వస్తున్నాయి. వానాకాలం పంటలకు సరిపడా యూరియా లేకపోవడంతో అధికారులు బఫర్ స్టాక్‌ను సైతం వాడేశారు. అధికారుల ముందు చూపు కొరవడిన కారణంగా యూరియా కొరత ఏర్పడింది. దీంతో అత్యవసరాలకు ఉపయోగించే బఫర్ స్టాక్‌ని […]

Update: 2020-07-29 23:28 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :
యూరియా బస్తాలు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నాటు వేసే సమయమని యూరియా లేకపోతే ఎలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని సొసైటీలకు ఎరువుల కోసం వెళ్తే స్టాక్ లేదనే సమాధానాలు వస్తున్నాయి. వానాకాలం పంటలకు సరిపడా యూరియా లేకపోవడంతో అధికారులు బఫర్ స్టాక్‌ను సైతం వాడేశారు. అధికారుల ముందు చూపు కొరవడిన కారణంగా యూరియా కొరత ఏర్పడింది. దీంతో అత్యవసరాలకు ఉపయోగించే బఫర్ స్టాక్‌ని వినియోగిస్తున్నారు. మరోపక్క యూరియా కోసం పలు చోట్ల రైతులు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి, మోర్తాడ్ కామారెడ్డి జిల్లా పిట్లం, జుక్కల్, మద్నూర్‌లలో రైతులు ఆందోళనకు దిగారు. తాడ్వాయిలోనైతే తమ గ్రామానికి రావాల్సిన స్టాక్‌ను మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామ సొసైటీకి తరలించడంతో రైతులు రోడ్డుపై బైటాయించారు. రానున్న రోజుల్లో యూరియా, ఎరువుల అవసరం ఎక్కువగా ఉంటుంది. అధికారులు మేల్కొనకపోతే రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

8.86 లక్షల ఎకరాల్లో సాగు..

నిజామాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 8.86 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని అంచనా వేశారు అధికారులు. ఇందు కోసం ప్రతిపాదనలు పంపారు. కరోనా కారణంగా సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎరువులు సకాలంలో చేరలేకపోయాయి. ఒక్క నిజామాబాద్ జిల్లాలో 67 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 48 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అందులో పాతస్టాక్ 18 వేల బఫర్ స్టాక్‌తో కలిపి వచ్చిన 30 వేల మెట్రిక్ టన్నుల యూరియాను వాడేశారు. అధికారికంగా సొసైటీల్లో 2,500 మెట్రిక్ టన్నుల ఉన్న యూరియాను ఆయా సహకార సంఘాలకు అందజేశారు. అయితే పాలక వర్గాల పెద్దలు ఎరువులను నిల్వ చేసుకోవడం, కావాల్సిన వారికి పంపిణీ చేయడం వల్ల ఎరువుల కొరత ఏడ్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని విక్రయించినట్లు పాలక వర్గాలు చెబుతున్నా, పీవోసీ యంత్రాల్లో నమోదు కాకపోవడంతో సరుకు పక్కదారి పట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పీవోసీ యంత్రాల్లో అమ్మకం వివరాలు ఎప్పటికప్పుడు చేర్చకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క రైతుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో వ్యవసాయ శాఖ అత్యవసర నిల్వలను (బఫర్ స్టాక్)ను వాడేస్తుంది. ఈ జిల్లాలో 400 మెట్రిక్ టన్నుల బఫర్‌స్టాక్ మాత్రమే మిగిలింది. దీంతో ప్రస్తుతం యూరియా కొరత ఏర్పడగా.. మరోపక్క గత 15 రోజులుగా యూరియా వ్యాగన్లు జిల్లాకు రాకపోవడం కూడా కొరతకి కారణం అంటున్నారు. గద్వాల జిల్లా నుంచి 500 మెట్రిక్ టన్నుల యూరియా తెప్పిస్తున్నామని అధికారులు చెప్తున్నా.. ఇంకా చేరడం లేదు.

రోజుకు వెయ్యి టన్నులు..

సోయాబీన్, మొక్కజొన్న లాంటి పంటలకు ప్రస్తుతం నత్రజని (యూరియా) అవసరం. ప్రస్తుతం రోజుకు వెయ్యి మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. జిల్లాలోని సొసైటీలు, కంపెణీ గోదాములు, మార్క్‌ఫెడ్ గోదాంలు, ప్రైవేటు డీలర్లందరి వద్ద కలిపి 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ, పొటాష్ లాంటి ఎరువులన్నీ కలిపి 23 వేల మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎరువుల అమ్మకాలు జరిగాయి. అయితే అమ్మకం వివరాలు పీవోసీ యంత్రాల్లో పొందుపరచని కారణంగా గందరగోళం ఏర్పడింది. సిగ్నల్స్ రావడం లేదని, కరోనా కారణంగా వేలి ముద్రలు తీసుకోవడం లేదని, అందుకే పీవోసీ యంత్రాల్లో రికార్డ్ చేయలేకపోయామని చెబుతున్నాయి సొసైటీలు. దీనికి తోడు సొసైటీ పెద్దలు ఉద్దేర బేరంతో స్టాక్ ముందుగానే తరలించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో సరుకు లేకపోయినా రికార్డ్‌లో ఉన్నట్లు కనబడుతుంది. గత సంవత్సరం కూడా రైతుల పేరు మీద వేల సంఖ్యలో బస్తాలు విక్రయించి దోచుకున్న పెద్దలు ఈ సారి కూడా అదే పనిలో ఉన్నారు.

Tags:    

Similar News