పైసల్లేవ్.. మరి ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలెట్లా!
దిశ, న్యూస్ బ్యూరో: ఆర్టీసీ ఉద్యోగులకు వేతన గండం వెంటాడుతోంది. జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇప్పటి వరకూ ఎలాగో సర్దుబాటు చేశామని, ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తామనే ధోరణితో ప్రభుత్వం ఉంది. సమ్మె అనంతరం, ఆర్టీసీలో ఇక కార్మికులు లేరని, అంతా ఉద్యోగులేనని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా మొదటి తేదీనాడే వేతనాలు ఇస్తామంటూ ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట దాటవేస్తున్నారు. ఆర్టీసీ […]
దిశ, న్యూస్ బ్యూరో:
ఆర్టీసీ ఉద్యోగులకు వేతన గండం వెంటాడుతోంది. జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇప్పటి వరకూ ఎలాగో సర్దుబాటు చేశామని, ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తామనే ధోరణితో ప్రభుత్వం ఉంది. సమ్మె అనంతరం, ఆర్టీసీలో ఇక కార్మికులు లేరని, అంతా ఉద్యోగులేనని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా మొదటి తేదీనాడే వేతనాలు ఇస్తామంటూ ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట దాటవేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందిని కార్మికులుగానే చూస్తున్నారు. ఆర్టీసీ దగ్గర జీతాలిచ్చిందుకు చిల్లిగవ్వ కూడా లేదు. దీంతో ఈ నెల వేతనాలు ఎలా ఇవ్వాలో తెలియక యాజమాన్యం సతమతమవుతోంది.
రూ. 600 కోట్ల అప్పు..
ప్రతి నెలా సగటున రూ. 168 కోట్ల వేతనాలను, రూ. 24 కోట్ల పెన్షన్లను చెల్లించాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మార్చి నుంచి ఆర్టీసీలోని 49,200 మంది ఉద్యోగులకు వేతనాల కష్టం మొదలైంది. ఆస్తులను తనఖా పెట్టి రూ.600 కోట్లు అప్పు తెచ్చి మే నెల వరకు జీతాలను సర్దుబాటు చేశారు. ఖాతాలో రూపాయి కూడా లేకపోవడంతో జూన్ వేతనాల కోసం ప్రభుత్వా నికి విన్నవించారు. ప్రభుత్వం బాండ్లు, రీఎంబర్సీమెంట్, పాత బకాయిలను కలుపుకుని రూ. 150 కోట్లు ఇచ్చింది. దీంతో ఉద్యోగానికి హాజరైనవారు, హజరుకానివారు, సెలవులు అంటూ లెక్కలు వేసుకుని వేతనాలకు సర్దుబాటు చేశారు. పెన్షన్‌దారులకు మాత్రం పెండింగ్లో పెట్టారు.
20 వేల మంది పెన్షన్‌దారులకు రూ.24 కోట్లు నెల నెలా ఇవ్వాలి. జూన్ నుంచి ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి రూపాయి వచ్చే పరిస్థితి లేదని స్పష్టమైంది. ఆగస్టు 20 నుంచి వేతనాల కోసం విన్నవిస్తున్నారు. సర్కారు నుంచి సమాధానం రాలేదు. గత నెల నుంచి ఆర్టీసీ గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులు నడుపుతోంది. ఆదాయం కంటే ఎక్కువగా పెట్టుబడే ఉంటోంది. ఆర్టీసీ కార్మికులు ఒక సొసైటీగా ఏర్పడి తమ జీతాల్లోంచి కొంత సొమ్ము పొదుపు చేసుకుంటారు. దాని నుంచి అవసరమైన వారు అప్పులు తీసుకుంటారు. ఆ సంస్థ దగ్గరున్న సుమారు రూ. 560 కోట్లను ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే వాడేసుకుంది.
ఇదీ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి..
ఆర్టీసీకి 2018-19లో టికెట్ల ద్వారా రూ.3,976 కోట్ల ఆదాయం సమకూరింది. షాపుల అద్దెలు, ప్రకటనలు, పార్శిల్స్ ద్వారా రూ.1000 కోట్లు వచ్చాయి. ఆదాయం కంటే ఖర్చులే అధికంగా కనిపిస్తున్నాయి. అదనంగా రూ.1000 కోట్ల రూపాయల ఖర్చు తేలింది. 2018-19లో ఆర్టీసికి వచ్చిన నష్టం రూ.928 కోట్లు. 2019 మే నెలలో కిలోమీటర్‌కు రూ.42.89 ఖర్చు కాగా, ఆదాయం కిలో మీటర్‌కు రూ.30.35గా తేలింది. ఈ ఏడాది ఆదాయం భారీగా తగ్గంది. గత నెల నుంచి 10,400 బస్సులకు 3 వేల బస్సులను మాత్రమే నడుపుతున్నారు. ఆదాయం రూ. 2.50 కోట్లు మాత్రమే. ఇవి నిర్వహణకే సరిపోతున్నాయి.
ఈ నెల వరకు ఆర్టీసీ ఆదాయం, నిర్వహణ ఖర్చులన్నీ లెక్కెస్తే మిగిలింది రూ. 9 కోట్లు. పెన్షనర్లు మినహాయించి ఉద్యోగులకు చెల్లించాల్సిన సొమ్ము రూ.168 కోట్లు. 2014 నుంచి ఆర్టీసీకి గ్రేటర్‌తో పాటు వివిధ సంస్థలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.1100 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం 2019లో ఇచ్చిన అప్పు రూ.70 కోట్లు మాత్రమే. కొత్త బస్సులు కొనడానికి చేసిన అప్పు రూ.140 కోట్లు పేరుకుపోయింది. ఆర్టీసీ ఆస్తులను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. రూ. 850 కోట్ల ఆర్టీసీ అప్పులకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంది. ప్రస్తుతం ఆర్టీసీకి సుమారు రూ.3,700 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆదాయం కంటే ఏటా వెయ్యి కోట్ల రూపాయల వరకు అదనపు వ్యయం ఉంటుంది. ఖర్చులో ఎక్కువ భాగం జీతాలు, డీజిల్, పన్నులకే పోతుంది.
వేతనాలు ఇవ్వాలి..
ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రకటించినా అమలు కాలేదు. ప్రతి నెలా వేతనాలు వస్తాయా, రావా? ఎట్లా బతుకాలే అన్నట్లు కార్మికులు భయపడుతున్నారు. ఈ నెల జీతాల కోసం రూపాయి లేదు. కార్మికులు, వారి కుటుంబాలను కరోనా ఆగమాగం చేస్తోంది. ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. ఉద్యోగులుగా గుర్తిస్తున్నామన్నారు కానీ, వారిలాగా జీతాలు ఇస్తలేరు. వెంటనే ప్రభుత్వం జీతాల కోసం నిధులు విడుదల చేయాలి. వేతనాలకు ఇబ్బందులు రాకుండా ఆర్టీసీ ఖాతాలో నిధులు నిల్వ పెట్టాలి.
– అశ్వత్థామరెడ్డి, టీఎంయూ నేత
ఇదీ పరిస్థితి..
ఆర్టీసీలో మొత్తం ఉద్యోగులు 49,200
పెన్షన్‌దారులు 20,000
నెల నెలా చెల్లించాల్సిన వేతనాలు రూ. 169 కోట్లు
ఆర్టీసీ ఖాతాలో ఉన్నవి రూ. 9 కోట్లు
ఇవ్వాల్సిన పెన్షన్ (రెండు నెలలు) రూ. 48 కోట్లు
ఈ నెల కావాల్సిన సొమ్ము రూ. 207 కోట్లు