సెంటిమెంట్ అస్త్రం.. సాయం శూన్యం..!

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతను అభ్యర్థిగా ప్రకటించిన టీఆర్ఎస్ ఫ్యామిలీ, మహిళా సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చింది. కానీ ఆ నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం సిద్దిపేట జిల్లాలోని మహిళలకు ప్రభుత్వం నుంచి సకాలంలో సరైన ఆర్థిక సాయం అందలేదు. కేవలం ఈ ఒక్క జిల్లాలోని మహిళా సంఘాలకే ప్రభుత్వం నుంచి సుమారు రూ. 73.49 కోట్ల మేరకు వడ్డీ బకాయిలు అందాల్సి ఉంది. కరోనా కష్టకాలంలోనూ […]

Update: 2020-10-08 23:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతను అభ్యర్థిగా ప్రకటించిన టీఆర్ఎస్ ఫ్యామిలీ, మహిళా సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చింది. కానీ ఆ నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం సిద్దిపేట జిల్లాలోని మహిళలకు ప్రభుత్వం నుంచి సకాలంలో సరైన ఆర్థిక సాయం అందలేదు. కేవలం ఈ ఒక్క జిల్లాలోని మహిళా సంఘాలకే ప్రభుత్వం నుంచి సుమారు రూ. 73.49 కోట్ల మేరకు వడ్డీ బకాయిలు అందాల్సి ఉంది.

కరోనా కష్టకాలంలోనూ మహిళలు వారి కష్టార్జితంగా దాచుకున్న పొదుపు డబ్బులతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సకాలంలో కిస్తీ, వడ్డీలు కడుతున్నారు. ప్రభుత్వం నుంచి బకాయిలు ఎప్పుడు విడుదలవుతాయా అని మహిళలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం సుమారు 730 మహిళా సంఘాలకు 2018 ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి వరకు… సుమారు రూ. 20.49 కోట్ల మేర ‘వడ్డీ లేని రుణాలు’ పథకం కింద ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు బకాయిలుగానే ఉండిపోయాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్, మానకొండూరు, జనగామ లాంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ సమస్య ఇదే తీరులో ఉంది.

చేతులెత్తేసిన బ్యాంకులు…

ప్రతి ఏటా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులకు ప్రభుత్వం లక్ష్యాలు విధిస్తుంది. ఆ రుణాలపై బ్యాంకులు విధించే వడ్డీని ప్రభుత్వమే సబ్సిడీగా చెల్లిస్తుంది. దీంతో మహిళలపై వడ్డీ భారం ఉండదు. ఆ ప్రకారం మహిళా సంఘాలు కట్టాల్సిన వడ్డీని క్రమం తప్పకుండా ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించాలి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఒక రూపాయి వడ్డీతో కలిపి కిస్తీలను చెల్లిస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలకు మహిళలు ప్రతినెలా క్రమం తప్పకుండా సకాలంలో కిస్తీలు చెల్లిస్తున్నా, ప్రభుత్వం నుంచి రెండేళ్ళుగా రాయితీల చెల్లింపు జరగడంలేదు. కరోనా కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. మహిళలపై కనిపించని కుటుంబ, ఆర్థిక భారం పడింది. ఆ ప్రభావంతో మహిళా సంఘాలు అనేక రకాలుగా చితికిపోయాయి. ప్రభుత్వం కొవిడ్ రుణం పేరుతో ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి సభ్యురాలికి వడ్డీ లేకుండా రుణం అందించే ఏర్పాట్లు చేసింది. కానీ వడ్డీ రాయితీ చెల్లింపు లేకపోవడంతో బ్యాంకులకు అనివార్యంగా మహిళలే కట్టుకోవాల్సి వస్తోంది.

2018 ఆగస్టు నుంచి 2019 మార్చి వరకు బకాయిలు : రూ. 27.82 కోట్లు (16,243 మహిళా సంఘాలు)
2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు: రూ. 45.67 కోట్లు (16,148 మహిళా సంఘాలు)
సిద్దిపేట జిల్లా మొత్తంలో ఉన్న గ్రామ సమాక్య సంఘాలు: 719
సిద్దిపేట జిల్లాలోని మొత్తం స్వయం సహాయక మహిళా సంఘాలు : 16,783
ఈ సంఘాలలోని సభ్యుల సంఖ్య : 1,84,078

బకాయిల వివరాలు (2018 ఆగస్టు నుంచి 2020 మార్చి వరకు)

గజ్వేల్ నియోజకవర్గం..

మొత్తం మహిళా సంఘాలు : 4,411
ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు : రూ. 20.49 కోట్లు

సిద్దిపేట నియోజకవర్గం..

మొత్తం మహిళా సంఘాలు : 3,389
ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు : రూ. 16.47 కోట్లు

దుబ్బాక నియోజకవర్గం..

మొత్తం మహిళా సంఘాలు : 3,734
ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు : రూ. 16.76 కోట్లు

హుస్నాబాద్ నియోజకవర్గం..

మొత్తం మహిళా సంఘాలు : 2,146
ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు : రూ. 10.03 కోట్లు

మానకొండూరు నియోజకవర్గం..

మొత్తం మహిళా సంఘాలు : 723
ప్రభుత్వం నుండిరావాల్సిన బకాయిలు : రూ. 3.75 కోట్లు

జనగాం నియోజకవర్గం..

మొత్తం మహిళా సంఘాలు : 1,840
ప్రభుత్వం నుండిరావాల్సిన బకాయిలు : రూ. 5. 69 కోట్లు

Tags:    

Similar News