సర్కారు ఆసుపత్రిలో సౌకర్యాలు కరువు.. రోగులపై వైద్య సిబ్బంది దాడులు
దిశ, మునుగోడు : గత కొన్నేండ్లుగా ప్రజలు కరోనా వైరస్‌తో ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నిర్మూలనకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆసుపత్రిలోకి వచ్చే రోగులను పట్టించుకోకుండా మాస్క్, శానిటైజేషన్ లేకుండా లోపలికి ఆహ్వానిస్తున్నారు. స్ధానిక వైద్యాధికారి మాటలను లెక్కచేయకుండా సిబ్బంది ఇష్టానుసారంగా రోగులతో ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వైద్యాధికారులు, సిబ్బంది.. అవేవీ పట్టించుకోకుండా విధులు […]
దిశ, మునుగోడు : గత కొన్నేండ్లుగా ప్రజలు కరోనా వైరస్‌తో ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నిర్మూలనకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆసుపత్రిలోకి వచ్చే రోగులను పట్టించుకోకుండా మాస్క్, శానిటైజేషన్ లేకుండా లోపలికి ఆహ్వానిస్తున్నారు.
స్ధానిక వైద్యాధికారి మాటలను లెక్కచేయకుండా సిబ్బంది ఇష్టానుసారంగా రోగులతో ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వైద్యాధికారులు, సిబ్బంది.. అవేవీ పట్టించుకోకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. రోగుల బాధలు పట్టించుకోకపోవడంతో వారు సహనం కోల్పోయి మాట్లాడితే.. వారిపైనే వైద్య సిబ్బంది ఎదురుదాడికి పాల్పడుతున్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగులు రోగులు చెప్పిన విషయం వినకుండా వాళ్లు చెప్పిందే వినాలని అంటున్నారు. లేకపోతే గొడవలకు దిగుతున్నారు.
దీంతో, రోగులు ఆసుపత్రికి వెళ్లాలంటే బయపడుతున్నారు. అంతేకాకుండా ఆ ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగుల సన్నిహితులను, తెలిసిన వ్యక్తులను బాగా చూసుకుంటూ.. మిగిలిన రోగులను పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలబులతో పాటు వైరల్ ఫీవర్ వస్తాయి. వీటికి కూడా మెడిసిన్ రాసి, కరోనా టెస్ట్ చేయాలని చెబుతున్నారు.
దీంతో కొంత మంది రోగులు కరోనా టెస్టు చేసుకోకుండా.. మెడిసిన్ ఇవ్వాలని కోరితే.. లేదు టెస్టు చేసుకోవాలని రోగులతో వైద్య సిబ్బంది వాదిస్తున్నారు. వారం రోజులుగా జ్వరం తగ్గకుండా, దగ్గు, ఒళ్లు నొప్పులు వస్తే కరోనా టెస్టు చేయాలి. కానీ అవేవీ పట్టించుకోకుండా సాధారణంగా ఆసుపత్రికి వచ్చిన రోగులకు కరోనా టెస్టులు చేసుకోవాలని భయపెడుతున్నారు. ఇలాంటి వైద్యాధికారులు, సిబ్బందితో రోగుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
టెస్టులకు సమయం లేదు..
ఒక వేళ కరోనా టెస్టు చేయించుకోవాలని వైద్యాధికారి సూచిస్తే.. మొదటగా కొవిడ్ టెస్టు చేయాలని ప్రిస్క్రిప్షన్ రాయాలి. కానీ, మెడిసిన్ రాస్తున్నారు. టెస్టు చేయించుకున్నాక వచ్చిన రిజల్ట్ చూసి మెడిసిన్ ఇవ్వాలి.. కానీ వారు అలా చేయడం లేదు.
ముందుగానే మెడికల్ స్లిప్‌లో మెడిసిన్, టెస్టు చేయించుకోవాలని చెప్పడం వెనుక ఆంతర్యామేమిటి. అంటే మధ్యాహ్నం వరకు పని పూర్తి చేసుకొని వెళ్లిపోవాలని సిబ్బంది భావిస్తున్నారా అనే అనుమానం వస్తున్నది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులకు సరఫరా చేసే మెడిసిన్లను తమ బంధువులకు, స్నేహితులకు షీట్లకు షీట్లు అంతర్గతంగా సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా కరోనా టెస్టులకు వచ్చే రోగులను ఎండలో కూర్చోబెడుతున్నారు. నీరసంగా ఉన్న రోగులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఆ రోగులు ఉదయం 9 గంటలకు వస్తే మధ్యాహ్నం 1 గంట తర్వాత కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇలాంటి దుస్థితి మండల ప్రాథమిక ఆసుపత్రిలో కొనసాగుతోంది.