బంజారాహిల్స్ ల్యాండ్ ఇష్యూలో కొత్త ట్విస్ట్
దిశ, క్రైమ్ బ్యూరో: బంజారాహిల్స్ ల్యాండ్ ఇష్యూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు ఈ వివాదం కోర్టు తీర్పు స్థలం చుట్టూ నడవగా, ప్రస్తుతం మరో స్థల వివాదం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలన్నీ షేక్‌పేట ఎమ్మార్వో చింతల సుజాత బంజారాహిల్స్ పీఎస్‌లో చేసిన ఫిర్యాదులో స్పష్టంగా ఉన్నాయి. సర్వే నెం.129/59 స్థల వివాదంలో కోర్టు జోక్యంతో ఏమీ చేయలేక, రోడ్డు నెం.14 లోని మరో స్థలాన్ని అబ్దుల్ ఖలీద్ ఆక్రమించినట్లుగా తహసీల్దార్ సుజాత పోలీసులకు […]
దిశ, క్రైమ్ బ్యూరో: బంజారాహిల్స్ ల్యాండ్ ఇష్యూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు ఈ వివాదం కోర్టు తీర్పు స్థలం చుట్టూ నడవగా, ప్రస్తుతం మరో స్థల వివాదం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలన్నీ షేక్‌పేట ఎమ్మార్వో చింతల సుజాత బంజారాహిల్స్ పీఎస్‌లో చేసిన ఫిర్యాదులో స్పష్టంగా ఉన్నాయి. సర్వే నెం.129/59 స్థల వివాదంలో కోర్టు జోక్యంతో ఏమీ చేయలేక, రోడ్డు నెం.14 లోని మరో స్థలాన్ని అబ్దుల్ ఖలీద్ ఆక్రమించినట్లుగా తహసీల్దార్ సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కోర్టు వివాదానికి సంబంధించిన స్థలం నుంచి డబ్బులు లాగేందుకు అధికారులు మైండ్ గేమ్ ప్లే చేసి చివరకు ఏసీబీ వలలో చిక్కుకున్నారు.
ఇదీ.. అసలు వివాదం
హైదరాబాద్ మీరాలం మండీకి చెందిన అబ్దుల్ ఖలీద్ సర్వే నెంబర్ 129/59 లో 4,865 చదరపు గజాల స్థలం తనదే నంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయంలో అబ్దుల్ ఖలీద్‌కు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నందున, రెవెన్యూ శాఖ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కానీ, నగరంలో అత్యంత ఖరీదైన బంజారాహిల్స్‌లో ఎకరానికి పైగా స్థలం అబ్దుల్ ఖలీద్‌కు సొంతం అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఈ విషయంపై తహసీల్దార్ సుజాత బంజారాహిల్స్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు. కానీ, ఇదే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఆశా ఆస్పత్రి దగ్గర.. కోర్టు వివాద స్థలానికి సమీపంలో ఉండే సర్వే నెం. 403/పి లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు అబ్దుల్ ఖలీద్ ప్రయత్నం చేశారని, ఈ స్థలంలో అప్పటికే ఉన్న ప్రభుత్వ స్థలం బోర్డును తొలగించి, ప్రయివేటు బోర్డును ఏర్పాటు చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమయంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది అడ్డుకున్నప్పటికీ, సదరు వ్యక్తి పదే పదే తన వ్యక్తిగత బోర్డును ఉంచినట్టు తెలిపారు. దీంతో అబ్దుల్ ఖలీద్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అధికారుల మైండ్ గేమ్
వాస్తవానికి, అబ్దుల్ ఖలీద్ సర్వే నెం. 403/పిలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నిస్తే కేసు నమోదు చేసి విచారణ చేయాల్సి ఉంది. కానీ అలా చేయకుండా అబ్దుల్ ఖలీద్ నుంచి ఆర్ఐ నాగార్జునరెడ్డి రూ.15లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కోర్టు తీర్పు స్థలం నుంచి డబ్బులు లాగేందుకు కుదరక పోవడంతో మరో స్థలాన్ని అబ్దుల్ ఖలీద్ కబ్జా చేస్తున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసి అధికారులు మెండ్‌గేమ్ ఆడినట్లు పలువురు భావిస్తున్నారు.