నగరంలో నయా కనెక్షన్స్.. ఆరునెలల్లోనే 1.25 లక్షలకు పైగా..
దిశ, తెలంగాణ బ్యూరో : మహానగరంలో కొత్త విద్యుత్ కనెక్షన్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల ఆరు నెలల సమయంలోనే 1.25 లక్షలకు పైగా కొత్త కనెక్షన్లను వినియోగదారులు తీసుకున్నారు. నగర శివార్లలో నిర్మాణ పనులు వేగం పుంజుకోవడమే ఇందుకు కారణమని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. కొవిడ్ సమయంలో కన్ స్ట్రక్షన్ పనులకు కొంత ఆటంకం ఏర్పడటంతో కొత్త కనెక్షన్లు అంతంతమాత్రంగా ఉన్నా ఆరు నెలల వ్యవధిలోనే అనూహ్య రీతిలో పెరిగిపోయాయి. గతేడాది జనవరి నుంచి జూన్ వరకు […]
దిశ, తెలంగాణ బ్యూరో : మహానగరంలో కొత్త విద్యుత్ కనెక్షన్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల ఆరు నెలల సమయంలోనే 1.25 లక్షలకు పైగా కొత్త కనెక్షన్లను వినియోగదారులు తీసుకున్నారు. నగర శివార్లలో నిర్మాణ పనులు వేగం పుంజుకోవడమే ఇందుకు కారణమని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. కొవిడ్ సమయంలో కన్ స్ట్రక్షన్ పనులకు కొంత ఆటంకం ఏర్పడటంతో కొత్త కనెక్షన్లు అంతంతమాత్రంగా ఉన్నా ఆరు నెలల వ్యవధిలోనే అనూహ్య రీతిలో పెరిగిపోయాయి. గతేడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో 95 వేల కొత్త కనెక్షన్లు మంజూరైతే.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లోనే రికార్డు స్థాయిలో 1.25 లక్షల కనెక్షన్లను సంస్థ మంజూరు చేసింది. దాదాపు 31 వేల కనెక్షన్లు పెరగడం గమనార్హం.
గ్రేటర్ హైదరాబాద్ లో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నూతన విద్యుత్ కనెక్షన్ల సంఖ్య పెరుగుతోంది. అత్యధికంగా మేడ్చల్ సర్కిల్ పరిధిలో 23,337 కనెక్షను మంజూరైనట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. అత్యల్పంగా బంజారాహిల్స్‌లో 5400 కనెక్షన్లు మంజూరయ్యాయి. మహానగరంలో ఇప్పటి వరకు మొత్తం 52.67 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజు సాధారణంగా 55 నుంచి 60 మిలియన్ యూనిట్లు వినియోగం నమోదవుతోంది. అదే సమ్మర్‌లో అయితే దాదాపుం 80 మిలియన్ యూనిట్లకు పైగా డిమాండ్ పెరుగుతోంది. విద్యుత్ కనెక్షన్లు ఇలాగే క్రమంగా పెరిగిట్లయితే గ్రేటర్ పరిధిలో మరో రెండు మూడేళ్లలో విద్యుత్ వినియోగం 100 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశాలున్నాయి. కొత్త కనెక్షన్ల సంఖ్య పెరగడంతో గ్రేటర్ పరిధిలో విద్యుత్ డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. నగరంలో అత్యధికంగా కనెక్షన్లు ఉన్న జోన్ గా హబ్సిగూడ నిలిచింది. 7,21,970 కనెక్షన్లు ఈ ఒక్క సర్కిల్ పరిధిలోనే ఉండటం గమనార్హం.
మహానగరంలోని శివారు ప్రాంతం రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. జనాభాకు అనుగుణంగా భవనాల అవసరాలు కూడా పెరుగుతుండటంతో నగరం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త భవనాలు కట్టడాలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు ఏరియాల్లో కొత్త ఇండ్ల నిర్మాణాల సంఖ్య వేలల్లో ఉన్నాయి. బహుళస్థాయి అపార్ట్ మెంట్లు సైతం విపరీతంగా వెలుస్తున్నాయి. ఇందుకు తగినట్లుగా విద్యుత్ శాఖ కొత్త లైన్లను ఏర్పాటు చేస్తోంది. మేడ్చల్ సర్కిల్ పరిధిలో ఏడాదిన్నరగా 490 డిస్ర్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయగా, ఇందులో 380 ప్రైవేట్ వ్యక్తులకే కేటాయించారంటే నగరం ఎంత త్వరగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా నగర శివారు ప్రాంతాల్లో 15 శాతం విద్యుత్ కనెక్షన్ల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్ పెద్దగా లేకపోవడంతో కొత్త కనెక్షన్ల సంఖ్య భారీగా పెరిగింది. శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. సబ్‌స్టేషన్లపై అదనపు లోడ్ పడకుండా ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచుతున్నారు.