కొత్త అడ్మిషన్లు సెప్టెంబర్‌లోనే

– పాత విద్యార్థులకు ఆగస్టు నుంచే తరగతులు – మార్గనిర్దేశాకాలు జారీ చేసిన యూజీసీ దిశ, న్యూస్‌బ్యూరో: కొత్త కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబరులో జరగనుంది. కరోనా కారణంగా జూన్, జూలై మాసాల్లో జరగాల్సిన ఈ ప్రక్రియ రెండు నెలలు ఆలస్యమైంది. కానీ, ఇప్పటికే చదువుతున్న పాత విద్యార్థులకు మాత్రం తరగతులు ఆగస్టులోనే ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన పరీక్షలను తిరిగి నిర్వహించడంపై ఆయా విశ్వవిద్యాలయాలే నిర్ణయం తీసుకోనున్నాయి. కరోనా పరిస్థితులు […]

Update: 2020-04-29 11:36 GMT

– పాత విద్యార్థులకు ఆగస్టు నుంచే తరగతులు
– మార్గనిర్దేశాకాలు జారీ చేసిన యూజీసీ

దిశ, న్యూస్‌బ్యూరో: కొత్త కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబరులో జరగనుంది. కరోనా కారణంగా జూన్, జూలై మాసాల్లో జరగాల్సిన ఈ ప్రక్రియ రెండు నెలలు ఆలస్యమైంది. కానీ, ఇప్పటికే చదువుతున్న పాత విద్యార్థులకు మాత్రం తరగతులు ఆగస్టులోనే ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన పరీక్షలను తిరిగి నిర్వహించడంపై ఆయా విశ్వవిద్యాలయాలే నిర్ణయం తీసుకోనున్నాయి. కరోనా పరిస్థితులు సద్దుమణిగినట్లయితే జూలైలోనే సెమిస్టర్/వార్షిక పరీక్షలు నిర్వహించాలని లేదంటే విశ్వవిద్యాలయాలు తగిన షెడ్యూలు ఖరారు చేసుకోవచ్చునని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొంది. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సినవి కావని, సలహా (అడ్వయిజరీ) మాత్రమేనని యూజీసీ స్పష్టం చేసింది. ఒకవేళ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనప్పుడు ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల సెమిస్టర్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా వారిని పై తరగతులకు ప్రమోట్ చేయవచ్చునని సూచించింది. ఒకవేళ సెమిస్టర్ పరీక్షలు కూడా జరగని పక్షంలో ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చునని సూచించింది.

విద్యార్థి రాసిన ఇంటర్నల్ పరీక్షలకు 50 శాతం మార్కులు, గత సెమిస్టర్లల్లో మార్కులకు 50శాతం చొప్పున వెయిటేజీ ఇవ్వాలని యూజీసీ పేర్కొంది. విద్యాసంవత్సరాన్ని పూర్తి చేసేందుకు యూనివర్సిటీలు కొత్త ఆలోచనలు, ప్రణాళికలు చేయొచ్చని యూజీసీ పేర్కొంది. పరీక్షల సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించడంపైనా ఆలోచనలు చేయాలని సూచించింది. ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నట్లయితే వాటిని కూడా పరిశీలించొచ్చని తెలిపింది. ఇవన్నీ సూచనప్రాయమే అయినందున స్థానిక, సమయ పరిస్థితులను బట్టి వీటిల్లో మార్పు చేసుకునేందుకు యూనిర్సిటీలకు తగిన స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. ఎంఫిల్, పీహెచ్‌డీ, వైవా లాంటి విషయాల్లో సైతం ఆరు నెలల గడువు ఇవ్వవచ్చని సూచించింది. అవసరాన్ని బట్టి స్కైప్ తదితర డిజిటల్ రూపాల ద్వారాపనూ నిర్వహించవచ్చని సూచించింది. డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు జరిగే సమయంలోనే ప్రాక్టికల్ పరీక్షలను కూడా నిర్వహించుకోవచ్చనని పేర్కొంది.

కరోనా కారణంగా డిగ్రీ, పీజీ పరీక్షలు జరగకపోవడంతో హర్యానా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. విస్తృతంగా అధ్యయనం చేసిన అనంతరం ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించడంలోని సంక్లిష్టతను నివేదికలో పొందుపరిచింది. కరోనా కారణంగా ఈసారి అకడమిక్ ఇయర్‌ను రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభించాలని సూచించింది. సెప్టెంబరు నుంచి కొత్త విద్యా సంవత్సరం ఉండేలా ప్లాన్ చేస్తే మంచిదని పేర్కొంది. పరీక్షల నిర్వహణ కోసం కూడా పలు సిఫారసులు చేసింది. ఇకపైన ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహించడంపై ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్శిటీ నిపుణుడితో మరో కమిటీని నియమించింది. ఈ కమిటీ కూడా నివేదిక సమర్పించింది. ఆ రెండు కమిటీల నివేదికలను ఆమోదించిన యూజీసీ సోమవారం వారితో సమావేశమై లోతుగా చర్చించింది. ఆ ప్రకారం బుధవారం మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

Tags: UGC, lockdown, universety, exams, acadamic,Guidlines

Tags:    

Similar News