మిషన్ భగీరథకు బ్రేకులేశారు..!
దిశ, వరంగల్ తూర్పు: రెండు శాఖల మధ్య సమన్వయ లోపం పలు సమస్యలకు కారణంగా మారుతోంది. ఇప్పటికే ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న వరంగల్ మహా నగరపాలక సంస్థ, ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తామంటున్న పబ్లిక్ హెల్త్ అధికారుల తీరు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారింది. పైప్‌లైన్‌కోసం తవ్విన గుంతలు అస్తవ్యస్తంగా ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు డివిజన్లలో మూడు నెలలుగా పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇంటింటికీ నీళ్లు.. […]
దిశ, వరంగల్ తూర్పు: రెండు శాఖల మధ్య సమన్వయ లోపం పలు సమస్యలకు కారణంగా మారుతోంది. ఇప్పటికే ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న వరంగల్ మహా నగరపాలక సంస్థ, ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తామంటున్న పబ్లిక్ హెల్త్ అధికారుల తీరు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారింది. పైప్‌లైన్‌కోసం తవ్విన గుంతలు అస్తవ్యస్తంగా ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు డివిజన్లలో మూడు నెలలుగా పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఇంటింటికీ నీళ్లు..
అమృత్ పథకంలో భాగంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలోని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రజారోగ్య శాఖ నడుం బిగించింది. దీనికోసం ప్రత్యేక పైప్ ఏర్పాటుతో పాటు ఇంటింటికీ నల్లా బిగించే పనులు చేపట్టారు. ఇందుకు కావాల్సిన ట్యాంకుల నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఫిబ్రవరి 1నుంచి తాగు నీటిని ఇంటింటికీ సరఫరా చేయాలంటూ కలెక్టర్‌తో పాటు జిల్లా మంత్రులు కూడా పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు.
ఎక్కడికక్కడ మిషన్ భగీరథ పనులు..
ఆశించిన రీతిలో మిషన్ భగీరథ పనులు ముందుకు సాగడంలేదు. పలు డివిజన్లలో మూడు నెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పనులు సాగుతున్నాయి. అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని పలు డివిజన్‌లలో గుంతలు తవ్వి వదిలివేయడంతో నిత్యం ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. పలువురి ఇంటి ముందే పైప్‌లైన్ ఏర్పాటు చేసినా దానిని వెంటనే మట్టితో నింపకపోవడంతో ఇంటి యజమానులు అధికారులపై గుర్రుగా ఉన్నారు.
పట్టించుకునే వారేరీ..
స్థానిక ప్రజా ప్రతినిధులకుగాని, బల్దియా అధికారులకు గాని మిషన్ భగీరథ పైప్‌లైన్ ఏర్పాటుపై ఎలాంటి సమాచారం ఉండడంలేదు. ప్రజారోగ్య శాఖ అధికారులు వచ్చి పనులు చేసేంతవరకు స్థానికులకు కూడా తెలియడం లేదు. వారు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు పనులు చేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కో పనిని నెలల తరబడి చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తిరగబడుతున్న ప్రజలు..
ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి అవసరం ఉన్నా పనుల్లో జరుగుతున్న జాప్యంతో ప్రజలు అధికారులపై తిరగబడుతున్నారు. డివిజన్‌లలో తీసిన గుంతలను వెంటనే పూడ్చివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డుపైనే పేరుకుపోతున్న మట్టి కుప్పలు కూడా తొలగించడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. ఈ విషయాన్ని కార్పొరేటర్ల దృష్టికి తీసుకుపోయినా వారు కూడా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
కౌన్సిల్‌లో చర్చ..
మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంపై ఇటీవల జరిగిన బల్దియా కౌన్సిల్ సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. మేయర్, కమిషనర్ సమక్షంలో మిషన్ భగీరథ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి డివిజన్‌లలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించాలని పలువురు కార్పొరేటర్లు పట్టు బట్టారు. లేకుంటే ప్రజల నుంచి చీత్కారాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మేయర్ ఈనెల 30న మిషన్ భగీరథ అధికారులతో కలిసి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు.