మినీ సమ్మక్క, సారలమ్మ జాతరపై నిర్లక్ష్యం
దిశ, వరంగల్ తూర్పు: నగరానికి అనుకొని ఉన్న అమ్మవారిపేట గ్రామంలోని దామెర గుట్టల్లో నిర్వహించనున్న మినీ సమ్మక్క, సారలమ్మ జాతరపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 24నుంచి నాలుగు రోజులపాటు మినీ జాతర నిర్వహించేందుకు జాతర కమిటీ ఏర్పాట్లు చేస్తున్నా పాలకునుంచి ఆశించిన రీతిలో స్పందన కరువైంది. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు వనభోజనాలకు ఇక్కడికే రావడంతో వారు వదిలేసిన ఖాళీ మందు బాటిళ్లు, వాటర్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. దీంతో ఆ […]
దిశ, వరంగల్ తూర్పు: నగరానికి అనుకొని ఉన్న అమ్మవారిపేట గ్రామంలోని దామెర గుట్టల్లో నిర్వహించనున్న మినీ సమ్మక్క, సారలమ్మ జాతరపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 24నుంచి నాలుగు రోజులపాటు మినీ జాతర నిర్వహించేందుకు జాతర కమిటీ ఏర్పాట్లు చేస్తున్నా పాలకునుంచి ఆశించిన రీతిలో స్పందన కరువైంది. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు వనభోజనాలకు ఇక్కడికే రావడంతో వారు వదిలేసిన ఖాళీ మందు బాటిళ్లు, వాటర్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసనతో కంపుకొడుతోంది.
అధ్వాహ్నంగా రహదారి..
అమ్మవారిపేట సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు ఉన్న ఒకే ఒక్క దారి అధ్వాహ్నంగా మారింది. బట్టుపల్లి బైపాస్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో అమ్మవార్ల గద్దెలు ఉంటాయి. ఈ రెండు కిలోమీటర్ల ప్రయాణం నరకాన్ని చూపిస్తోంది. గత సంవత్సరం జాతర సమయంలో వేసిన రోడ్డు పూర్తిగా ధ్వంసమై కంకర తేలింది. జాతర నిర్వహించే ప్రాంతానికి చుట్టుపక్కల క్రషింగ్ యూనిట్లు అధికంగా ఉండడంతో భారీ వాహనాలు ఈ రహదారిపై ప్రయాణించడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తప్పని నీటి కష్టాలు..
అమ్మవారిపేట సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు తాగు నీటి కష్టాలు తప్పేలా లేవు. భక్తులకోసం గతంలో ఏర్పాటు చేసిన బోర్లు పనిచేయడం లేదు. దామెర గుట్టల్లో భక్తులు విడిది చేసేలా ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ దీపాలకూ మోక్షంలేదు. నగరంలోనే అమ్మవార్లు ఉన్నా వారిని దర్శిచుకునేందుకు మాత్రం తిప్పలు తప్పేలా లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైభవంగా జాతర..
దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆర్.కమల ఆధ్వర్యంలో దేవస్థాన కమిటీ ఇటీవల సమావేశం నిర్వహించారు. నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ జాతరకు కనీసం 20వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు. ఈ మేరకు భక్తులకు కావాల్సిన కనీస సదుమాయాలు కల్పించేలా ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ కొడూరి భిక్షపతి, జాతర ఆర్గనైజర్ దాసి రాందేవ్, కోశాధికారి భైరి నాగరాజు, శ్యామ్‌సుందర్‌రావు, గోపు రవిందర్, రాజేందర్ పాల్గొన్నారు.
కోతుల బెడద ఎక్కువ..
అమ్మవారి గద్దెల సమీపంలో వందల సంఖ్యలో కోతులు ఉన్నాయి. వాటినుంచి భక్తులను రక్షించాల్సిన బాధ్యత మహా నగరపాలక సంస్థ అధికారులపై ఉంది. నగరంలో పట్టుకున్న కోతులన్నింటినీ ఇక్కడే వదిలివేయడంతో వాటి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ జాతరకు పట్టణ ప్రాంతానికి చెందిన భక్తులే అధిక సంఖ్యలో హాజరవుతారు.
-దాసి రాందేవ్, జాతర ఆర్గనైజర్