కాట్రాపల్లి స్కాంపై ఉదాసీనత.. ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన దిశ పత్రిక
దిశ ప్రతినిధి, వరంగల్ : హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కాట్రాపల్లి ఐకేపీ సెంటర్‌లో జరిగిన ధాన్యం కొనుగోళ్ల స్కాంపై ఉన్నతాధికారుల ఉదాసీనత కనిపిస్తోంది. రూ.28లక్షల గోల్‌మాల్‌పై జేసీ విచారణకు ఆదేశించారని డీఆర్‌డీఏ అధికారులు చెబుతుండగా.. అయితే ఇప్పటి వరకు విచారణ మొదలు కాకపోవడం గమనార్హం. తూతు మంత్రంగా విచారణను పూర్తి చేసి నివేదిక సమర్పించి అక్రమార్కులను కాపాడేప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన ఎంపీటీసీ భర్త రఘుసింగ్‌ను కాపాడేందుకు అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు […]
దిశ ప్రతినిధి, వరంగల్ : హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కాట్రాపల్లి ఐకేపీ సెంటర్‌లో జరిగిన ధాన్యం కొనుగోళ్ల స్కాంపై ఉన్నతాధికారుల ఉదాసీనత కనిపిస్తోంది. రూ.28లక్షల గోల్‌మాల్‌పై జేసీ విచారణకు ఆదేశించారని డీఆర్‌డీఏ అధికారులు చెబుతుండగా.. అయితే ఇప్పటి వరకు విచారణ మొదలు కాకపోవడం గమనార్హం. తూతు మంత్రంగా విచారణను పూర్తి చేసి నివేదిక సమర్పించి అక్రమార్కులను కాపాడేప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన ఎంపీటీసీ భర్త రఘుసింగ్‌ను కాపాడేందుకు అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కాట్రాపల్లి ఐకేపీ సెంటర్‌లో కొంతమంది రైతులు ధాన్యం విక్రయించారని పేర్కొంటూ స్థానిక ఎంపీటీసీ భర్త రఘుసింగ్ తన అకౌంట్ నెంబర్‌ను రికార్డుల్లో నమోదయ్యేలా చక్రం తిప్పారు. 34దఫాలుగా మొత్తం రూ.28లక్షలు వేర్వేరు తేదీల్లో ఆయన అకౌంట్‌లో జమ కావడం గమనార్హం.
రఘుసింగ్ అక్రమ లీలలు..
కాట్రాపల్లి ఐకేపీ సెంటర్‌లో అక్రమాలపై ఈనెల 9వ తేదీన దిశ పత్రికలో ఆధారాలతో సహా స్కాం జరిగిన తీరుపై దిశలో సమగ్రమైన కథనం ప్రచురితమైంది. మరుసటి రోజున తానేమీ అక్రమాలకు పాల్పడలేదని రైతులకు అకౌంట్లు లేనందున తన అకౌంట్ నెంబర్ రికార్డుల్లో నమోదయ్యేలా చేసినట్లుగా వివరణ ఇచ్చాడు. అలాగే కొంతమందికి బ్యాంకుల్లో అప్పులు ఉండటంతో తన అకౌంట్ నమోదు చేయాలని వారు చెప్పడంతోనే తాను ఆవిధంగా చేసినట్లుగా పేర్కొనడం గమనార్హం. అయితే రైతులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. మా పేరు చేర్చింది కూడా తమకు తెలియదని దిశకు వెల్లడించారు. గ్రామ సర్పంచ్ భర్త వీరస్వామి పేరు మీద కూడా రఘుసింగ్ ధాన్యం అమ్మినట్లుగా రికార్డులు సృష్టించడం గమనార్హం. ఈ విషయం దిశ పత్రిక ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో అవాక్కయ్యారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్‌లో ధాన్యం అమ్మకాలు సాగించిన రైతుల పేర్ల మీదే.. రెండుసార్లు అమ్మినట్లుగా రఘుసింగ్ అధికారుల సాయంతో రికార్డులు సృష్టించాడు. దిశ రిపోర్టర్లు మహిళా రైతుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు మోసాన్ని గ్రహించారు.
విచారణ ఏదీ, రికవరీ ఏదీ..?
వారికి తెలియకుండానే వారి పేర్లపై విక్రయాలు జరిపిన ఎవరి పేర్లతోనైతే ధాన్యం అమ్మకం రికార్డులు సృష్టించి తన అకౌంట్లో నగదు జమయ్యేలా చేశాడో సంబంధిత రైతులను విచారిస్తే నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంది. 28లక్షల ప్రజాధనాన్ని రికవరీ చేసే అవకాశం ఉన్నా అధికారుల నిమ్మకుండటం విశేషం. అక్రమాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలతో పాటు రఘుసింగ్ వివరణలతో స్పష్టమవుతున్నా చర్యలకు అధికారులు వెనుకాడుతుండటంపై అనుమానాలకు తావిస్తోంది. అధికారుల సాయం లేకుండానే రఘుసింగ్ రికార్డులను సృష్టించలేడు అన్నది నిర్వివాదాంశం. ఈ క్రమంలో క్షేత్రస్థాయి అధికారులకూ వాటాలున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అందుకే విచారణకు ఆదేశించామని ఉన్నతాధికారులు చెబుతున్నా.. తమకేం అలాంటి ఆదేశాలు అందలేదని క్షేత్రస్థాయి అధికారులు వెల్లడిస్తుండటం గమనార్హం. ఈ రకమైన సమాధానాలతో రఘుసింగ్‌ను కాపాడేందుకు అధికారులు యత్నిస్తున్నారనే ఆరోపణలు బలం చేకూరుతోంది. ఇంత యథేచ్ఛగా రూ. 28లక్షల ప్రజాధనాన్ని లూటీ చేసిన అక్రమార్కుడిని అధికారులు రక్షించే ప్రయత్నాలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.
అది అక్రమమే.. విచారణకు ఆదేశించాం
కాట్రాపల్లి ఐకేపీ సెంటర్‌లో జరిగిన అక్రమాలు మా దృష్టికి వచ్చింది. దిశలో వచ్చిన కథనాలు నేను చదివాను. రఘుసింగ్ తన అకౌంట్లో నగదు జమ చేయించుకున్నట్లు కూడా ప్రెస్ మీట్‌లో వెల్లడించిన విషయం కూడా నా దృష్టికి వచ్చింది. ఈ స్కాంపై విచారణ చేపట్టాలని కింది స్థాయి అధికారులను ఆదేశించడం జరిగింది. త్వరలోనే నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాసరావు, హన్మకొండ జిల్లా డీఆర్‌డీవో