Court: పోక్సో కేసులో యడియూరప్ప పిటిషన్‌ విచారణ వాయిదా

మైనర్‌ను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, తనపై ఉన్న కేసును రద్దు చేయాలని వేసిన పిటిషన్‌‌పై విచారణను రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది

Update: 2024-09-19 12:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మైనర్‌ను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, తనపై ఉన్న కేసును రద్దు చేయాలని వేసిన పిటిషన్‌‌పై విచారణను రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. మార్చి 3, 2024న, మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆరోపణలపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై బాలల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదైంది. తరువాత ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో కేసును రద్దు చేయాలని కోరుతూ యడియూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, ముందస్తు బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని తాజాగా విచారించిన నాగ ప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఆయన్ను అరెస్టు చేయకుండా, విచారణకు హాజరు కావడానికి ఇచ్చిన మినహాయింపును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే విచారణ సందర్భంగా యడియూరప్పను అరెస్ట్ చేసి విచారించాలని, ఆయన వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని బాధితురాలి తరపున న్యాయవాది కోరారు. ఇదిలా ఉంటే, గతంలో కేసును సీఐడీకి బదిలీ చేసిన తరువాత వారు నోటీసులు జారీ చేయగా, కోర్టు విచారణకు హాజరై తనపై ఉన్న కేసును కొట్టివేయాలని, ఇదే కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లను ఆయన దాఖలు చేశారు.


Similar News