EY Employee Death: ఉద్యోగిని ఆత్మహత్యపై ఈవై సంస్థ ఛైర్మన్ రాజీవ్ మెమోనీ వ్యాఖ్యలు

ఉద్యోగిని ఆత్మహత్యపై యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా సంస్థ ఛైర్మన్ రాజీవ్ మెమానీ తొలిసారిగా స్పందించారు.

Update: 2024-09-20 05:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉద్యోగిని ఆత్మహత్యపై యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా సంస్థ ఛైర్మన్ రాజీవ్ మెమానీ తొలిసారిగా స్పందించారు. పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అన్నా సెబాస్టియన్‌ పెరియాలి అంత్యక్రియలకు కంపెనీ ఉద్యోగులు ఎవరూ హాజరు కాలేదని ఆమె తల్లి ఆరోపించింది. దీనిపై ఆ సంస్థ ఛైర్మన్‌ రాజీవ్‌ మెమానీ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని తెలిపారు. ‘‘ఆమె కుటుంబంతో మాట్లాడాను. సెబాస్టియన్‌ మృతికి సంతాపం తెలిపాను. వారి జీవితంలో ఏర్పడిన వెలితిని ఎవరూ పూడ్చలేరు. ఆమె అంత్యక్రియల సమయంలో మేము హాజరుకాలేకపోయినందుకు చింతిస్తున్నారు. ఇది మా పని సంస్కృతికి పూర్తిగా విరుద్ధం. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. భవిష్యత్తులో ఇలా జరగదు’’ అని లింక్డిన్ లో పోస్టు పెట్టారు. ఆయన చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ సంస్థలో విషపూరిత పని సంస్కృతి ఉందని పేర్కొన్నారు. అన్నా సెబాస్టియన్‌కు సంతాపం తెలిపారు.

అసలేమైందంటే?

మార్చిలో ఈవై కంపెనీలో చేరిన అన్నా సెబాస్టియన్ పెరియల్ జూలై 20న ఆత్మహత్య చేసుకుంది. పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి అనితా అగస్టిన్ కంపెనీకి రాసిన లేఖ వైరల్ కాగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె అంత్యక్రియలకు కంపెనీ నుంచి ఎవరూ హాజరుకాలేదని అనితా పేర్కొన్నారు. అంత్యక్రియల తర్వాత కంపెనీని సంప్రదించినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదన్నారు. విలువలు, మానవ హక్కుల గురించి మాట్లాడే ఓ సంస్థ కంపెనీ వ్యక్తులు చనిపోతే ఏం చేయదా? అని ప్రశ్నించారు. ఈ అంశం వైరల్ కావడంతో కేంద్రం అన్నా సెబాస్టియన్ మరణాన్ని సీరియస్ గా తీసుకుంది. పని వాతావరణంపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే గురువారం తెలిపారు.


Similar News