Shadow Cabinet : ఒడిశాలో తొలిసారిగా ‘షాడో క్యాబినెట్’.. ఏమిటిది ?

దిశ, నేషనల్ బ్యూరో : అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా తనదైన శైలిలోరాజకీయ వ్యూహ రచన చేస్తూ ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

Update: 2024-07-19 14:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా తనదైన శైలిలోరాజకీయ వ్యూహ రచన చేస్తూ ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒడిశాలో 25 ఏళ్ల తర్వాత గద్దె దిగిన నవీన్‌ పట్నాయక్‌ రాజకీయపార్టీ బిజూ జనతాదళ్(బీజేడీ) ఇప్పుడు బాధ్యతాయుత విపక్షంగా వ్యవహరించేందుకు రెడీ అవుతోంది. ఈక్రమంలోనే బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ షాడో క్యాబినెట్‌ను ఏర్పాటు చేస్తూ కీలక ప్రకటన చేశారు. సీఎం కావడానికి ముందు వరకు ఆయన ఎక్కువగా విదేశాల్లోనే ఉండేవారు. ఆ ప్రభావంతోనే ఒడిశాలోనూ షాడో క్యాబినెట్‌ను నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఆ దేశాల తరహాలో..

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్‌లో ప్రతిపక్ష పార్టీలు తమ సభ్యులతో షాడో క్యాబినెట్‌ను ఏర్పాటుచేసే సంప్రదాయం ఉంది. ఇందులో భాగంగా విపక్ష నేత తమ పార్టీ సభ్యులకు కొన్ని మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తారు. ఒడిశాలోనూ ఇదేవిధంగా నవీన్ పట్నాయక్ 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు వివిధ మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ బాధ్యతలను కేటాయించారు. ఈమేరకు బీజేడీ ఓ అధికారిక సర్క్యులర్ విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో, ఇతర సాధారణ సమయాల్లో ఈ ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన శాఖలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. దీనివల్ల అసెంబ్లీలో విపక్ష సభ్యులు అనవసర నినాదాలు చేయకుండా అర్ధవంతమైన అంశాలతో ప్రభుత్వంలోని మంత్రులను ప్రశ్నించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

జులై 22 నుంచి బడ్జెట్ సెషన్

ఒడిశా మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు రాష్ట్ర ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలను నవీన్ పట్నాయక్ అప్పగించారు. పరిపాలన, ప్రజా ఫిర్యాదుల శాఖలను ప్రతాప్ దేబ్ పర్యవేక్షిస్తారు. హోం, ఫుడ్, వినియోగదారుల సంక్షేమ శాఖలను మాజీ మంత్రి నిరంజన్ పూజారి పర్యవేక్షిస్తారు. జులై 22 నుంచి జరగనున్న ఒడిశా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో షాడో క్యాబినెట్‌ గళం విప్పేందుకు సిద్ధం అవుతోంది. అయితే షాడో క్యాబినెట్‌‌‌కు ఎలాంటి అధికారాలు ఉండవు. ఈ పరిణామం ఒడిశా సీఎం మోహన్ మాఝీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్దసవాల్‌గా మారే అవకాశం ఉంది.

గతంలో పలు రాష్ట్రాల్లోనూ ఈ ప్రయోగం..

ఈ తరహా షాడో క్యాబినెట్ ప్రయోగాన్ని గతంలో పలు రాష్ట్రాలు పాక్షికంగా చేశాయి. పూర్తిస్థాయి షాడో క్యాబినెట్‌ను ప్రకటించిన తొలి రాష్ట్రం మాత్రం ఒడిశానే. బీజేపీ ప్రభుత్వంలోని వివిధ శాఖల పనితీరును పర్యవేక్షించడానికి యువ శాసనసభ్యులను నియమిస్తామని రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత టీకారాం జుల్లీ ఇటీవల పేర్కొన్నారు. 2020లో బిహార్‌లోని పాట్నాలో 'జాగో' అనే బ్యానర్‌తో మేధావుల బృందం నాన్ పొలిటికల్ షాడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో 'ముఖ్యమంత్రి' వ్యవహారాలపై విమర్శలు చేసేందుకు డాక్టర్ సుమన్ లాల్ అనే కార్యకర్తను నియమించారు. మరో 32 మంది కార్యకర్తలకు వివిధ మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. 2015లో జెన్ నెక్స్ట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ గోవాలో ఇలాంటి ప్రయోగం చేసి చూసింది. 2015లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ షాడో క్యాబినెట్ తరహాలో పలువురికి కొన్ని మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది.

Tags:    

Similar News