Jaishankar :‘బ్రిక్స్‌’ను చూసి ఆ దేశాలు అభద్రతగా ఫీలవుతున్నాయ్ : విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్

దిశ, నేషనల్ బ్యూరో : జీ20 కూటమి ఉండగా జీ7 కూటమి ఉన్నప్పుడు.. అభివృద్ధిచెందుతున్న దేశాల కోసం ‘బ్రిక్స్’ కూటమి ఎందుకు ఉండకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రశ్నించారు.

Update: 2024-09-12 19:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జీ20 కూటమి ఉండగా జీ7 కూటమి ఉన్నప్పుడు.. అభివృద్ధిచెందుతున్న దేశాల కోసం ‘బ్రిక్స్’ కూటమి ఎందుకు ఉండకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రశ్నించారు. బ్రిక్స్ కూటమి అక్కర్లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. బ్రిక్స్ కూటమిని చూసి అభివృద్ధిచెందిన దేశాలు అభద్రతగా ఫీలవుతుంటే తనకెంతో ఆశ్చర్యం కలుగుతోందన్నారు. గురువారం రోజు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీ సదస్సులో జైశంకర్ ప్రసంగించారు. ఈసందర్భంగా ఫ్రాన్స్ రాయబారి జీన్ డేవిడ్ లెెవిట్‌తో జరిగిన సంభాషణలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

‘‘జీ7 కూటమి ఆల్‌రెడీ ఉందిగా అని చాలామంది వాదిస్తున్నారు. జీ7 ఉంది. కానీ.. అందరినీ అందులోకి చేరనివ్వడం లేదు కదా.. అందుకే మేం సొంతంగా ఒక కూటమిని (బ్రిక్స్) ఏర్పాటు చేసుకున్నాం’’ అని జైశంకర్ వివరించారు. భౌగోళిక, చారిత్రక సంబంధాలతో తావు లేకుండా వైవిధ్య నేపథ్యాలు కలిగిన అభివృద్ధిచెందుతున్న దేశాలు బ్రిక్స్ కూటమిలో ఉన్నాయని గుర్తు చేశారు. కాగా, బ్రిక్స్ కూటమిలో భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇరాన్, సౌదీ అరేబియా, ఈజిప్టు, యూఏఈ, ఇథియోపియా ఉన్నాయి. నాటో కూటమి దేశమైన టర్కీ కూడా బ్రిక్స్‌లో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తోంది.


Similar News