లక్నో: దేశంలోనే అత్యధిక జనాభా(దాదాపు 23.49కోట్లు) గల రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా ఊహించుకుంటే, చైనా, భారత్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేషియా, బ్రెజిల్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉండే ఆరో దేశంగా యూపీ నిలుస్తుంది. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఉత్తరప్రదేశ్‌కు.. దేశ రాజకీయాల్లోనూ ప్రత్యేక స్థానం ఉంది. దేశాన్ని ఏలాలనుకున్న పార్టీలన్నీ ముందుగా చూసేది ఈ రాష్ట్రం వైపే.
అత్యధిక పార్లమెంట్ నియోజకవర్గాల(80)తో పాటు, ఎక్కువ అసెంబ్లీ స్థానాలు యూపీలోనే ఉన్నాయి. త్వరలోనే పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నప్పటికీ అందరి దృష్టి మాత్రం ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ పైనే ఉంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే యూపీలో ఎలాగైనా, తమ పార్టీ జెండా ఎగురవేయాలని ఆయా పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న విడుదల కానున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా 79 శాతం హిందూ ఓటర్లు ఉండగా, 19 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నట్లు అంచనా. కులాల వారీగా చూసుకుంటే.. 44 శాతం మంది ఓబీసీలు, 20 శాతం దళిత ఓటర్లు, 15 శాతం మంది బ్రాహ్మణులు ఉన్నారు. యూపీలోనూ కులాలు, మతాల ఆధారంగా రాజకీయాలు సాగుతుంటాయి.
గెలుపుపై విశ్వాసంతో బీజేపీ..
గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 312 స్థానాల్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ.. రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ పార్టీగా అవతరించింది. హిందూ ఓట్లపైనే దృష్టి పెట్టిన బీజేపీ అందుకు అనుగుణంగానే క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నది. అటు ప్రధాని మోడీ ఇమేజ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు, యోగీ దూకుడు తనం బీజేపీకి సానుకూలాంశాలు. అయోధ్యలో రామమందిరం నిర్మాణ దశలో ఉండటం, వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడర్‌ను ప్రధాని మోడీ ఇటీవలే ప్రారంభించడం, ముస్లిం సంబంధిత పేర్లతో ఉన్న పలు ప్రాంతాలకు ఇతర పేర్లు పెట్టడం వంటివి హిందూ ఓటర్లలో సెంటిమెంట్‌గా మారనున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అంతేకాకుండా, ఈ ఎన్నికలు 80 శాతం మందికి, 20 శాతం మందికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించిన యోగీ.. హిందువులను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. యూపీలోనూ 'డబుల్ ఇంజన్' సర్కార్ నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లోనూ 300 పైగా స్థానాల్లో గెలుస్తామనే ధీమాతో ఉంది. మేనిఫెస్టోలోనూ 'లవ్ జిహాద్'కు పాల్పడినవారికి 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని పేర్కొని హిందూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అయితే, కీలకమైన ఓబీసీ నేతలు స్వామి ప్రసాద్ మౌర్య, ధారాసింగ్ చౌహాన్, ఓంప్రకాశ్ రాజ్‌భర్ సహా 10మంది నాయకులు పార్టీని వీడటం ఎదురు దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో 44శాతం మంది ఓబీసీలే ఉన్న విషయం తెలిసిందే. అలాగే, సాగు చట్టాలు తేవడం, వీటికి నిరసిస్తూ సుదీర్ఘకాలంపాటు రైతులు నిరసనలు చేయడం బీజేపీకి పడే ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అఖిలేశ్ ఒంటరి పోరు..
గత ఎన్నికల్లో 47 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సమాద్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. కుటుంబ పాలన అన్న ముద్రను పోగొట్టుకునేందుకు ఇంటి వాళ్లను పక్కనబెట్టిన పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్.. ఒంటరి పోరు చేస్తున్నారు. సొంత తమ్ముడి భార్య అపర్ణా యాదవ్, ములాయం సింగ్ తోడల్లుడు ప్రమోద్ గుప్తా పార్టీని వీడి బీజేపీలో చేరినా అంతగా పట్టించుకోలేదు. అంతేకాకుండా, స్థానిక కమ్యూనిటీలో పట్టున్న చిన్న చిన్న పార్టీలను కలుపుకుని ముందుకెళ్తున్నారు.
నిరుద్యోగం, రైతు సమస్యలు, హామీల విస్మరణలనే ప్రధాన అస్త్రాలు గా మార్చుకుని బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మేనిఫెస్టోలోనూ వీటిపైనే హామీనిచ్చారు. ఓబీసీలో మంచి పట్టున్న కీలక నేతలు బీజేపీని వీడి ఎస్పీ లో చేరడం పార్టీకి కలిసొస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాకుండా, తన ప్రసంగాలతో హిందూ ఓటర్లతో పాటు అటు ముస్లిం ఓటర్లకూ దగ్గరయ్యేందుకు అఖిలేశ్ ప్రయత్నిస్తున్నారు. అలాగే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అఖిలేశ్‌కు మద్దతుగా ప్రచారం చేపట్టడం కొంతమేర సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
సరికొత్త అస్త్రాలతో మాయావతి..
ఈ ఎన్నికల్లో బలంగా కనిపిస్తున్న బీజేపీ, ఎస్పీలను ఎదుర్కొనేందుకు మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) సరికొత్త అస్త్రాలతో ముందుకు వెళ్తోంది. దళిత ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే బ్రాహ్మణులు, ముస్లింలనూ ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తూ పునర్ వైభవాన్ని పొందేందుకు శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, నిరుద్యోగం, రైతు సమస్యలను లేవనెత్తుతూ బీజేపీని విమర్శిస్తున్నారు. అయితే, గతంతో పోల్చుకుంటే మాయావతి ప్రభ తగ్గిందని, బీజేపీ, ఎస్పీల మధ్య పోరులో బీఎస్పీ నలిగిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం 19 సీట్లలోనే గెలుపొంది, మూడో స్థానానికి పరిమితమైన బీఎస్పీ.. ఈ ఎన్నికల్లోనూ అదే స్థానంలో నిలిచే అవకాశమున్నట్టు చెబుతున్నారు.
కొత్త ముఖాలతో కాంగ్రెస్..
ఉత్తర ప్రదేశ్‌లో చివరిసారిగా 1985 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఆ తర్వాత నుంచి అధికారానికి దూరంగానే ఉంది. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. యూపీలో పార్టీ బాధ్యతలన్నింటినీ తన భుజాలపై వేసుకుని కీలకంగా వ్యవహరిస్తున్న ప్రియాంకా గాంధీ సైతం.. ఓ సందర్భంలో ఫలితాలను బట్టి ఎస్పీకి మద్దతిస్తామని చెప్పడం గమనార్హం. అఖిలేశ్ పోటీ చేస్తున్న కర్హాల్ స్థానంలోనూ కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈసారి రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి బరిలోకి దిగుతుండటం విశేషం. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. చాలావరకు సీట్లను కొత్తవారికే కేటాయించింది. మహిళలు, యువత, సమస్యలపై పోరాడే వారికి టికెట్ ఇచ్చి, ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.