ముఖ్యమంత్రి ఎవరనేది కూటమి సమిష్టి నిర్ణయం: శరద్ పవార్
రాబోయే ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రేను మహా వికాస్ అఘాడీ ముఖ్యమంత్రిగా ప్రకటించాలని శివసేన (యుబీటీ) పట్టుబడుతున్న నేపథ్యంలో ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రేను మహా వికాస్ అఘాడీ ముఖ్యమంత్రిగా ప్రకటించాలని శివసేన (యుబీటీ) పట్టుబడుతున్న నేపథ్యంలో ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎవరనేది కూటిమి సమిష్టి నిర్ణయమని స్పష్టం చేశారు. కొల్హాపూర్‌లో విలేకరుల సమావేశంలో, ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పట్టుబట్టడం గురించి అడిగినప్పుడు, దానికి సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించడంపై విమర్శలు చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న వారు అలా మాట్లాడటం సరికాదని, రాజకీయ ప్రకటన చేయడం స్పీకర్ పాత్రనా? ఆయన ప్రకటన సముచితం కాదని, రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఈ అంశాన్ని క్లుప్తంగా ప్రస్తావించారు. అది కూడా అవసరం లేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎంపిక కావడంపై ఆయన మాట్లాడుతూ, అత్యధికంగా ప్రతిపక్ష ఎంపీలు ఉన్న పార్టీ లోక్‌సభ పక్ష నేతను ఎన్నుకుంటారు. కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలిచినందున వారు రాహుల్ గాంధీని తమ నాయకుడిగా ఎంచుకున్నారని అన్నారు.