MANIPUR VOILENCE : మణిపూర్ మంటల వెనక అసలు నిజాలేంటి? (వీడియో)
భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హింస ఇంకా కొనసాగుతూనే ఉంది.
దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు యావత్ దేశాన్ని తీవ్ర ఆందోళన చెందేలా చేస్తున్నాయి. గత రెండు నెలలుగా పైగా ఆ రాష్ట్రంలో మెయితీ కమ్యూనిటీ, కుకీ గిరిజన తెగల మధ్య వివాదాల కారణంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 40 వేల మంది భద్రతా సిబ్బంది మోహరించారు. మణిపుర్‌లో పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కుకీ తెగ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఉదంతం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దానిపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది.
మే 3న రాష్ట్రంలోని కుకీలతో సహా ఇతర గిరిజన సంఘాలు.. మెయితీ కమ్యూనిటీకి తెగ హోదాను నిరసిస్తూ వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇరు వర్గాల సంఘాలు ఒకదానిపై మరొకటి దాడులకు దిగాయి. మెయితీ-ఆధిపత్య ప్రాంతాలలో నివసిస్తున్న కుకీ కమ్యూనిటీ ఇళ్లను ఆందోళనకారులు తగులబెట్టారు. వారిపై దాడి చేశారు. మణిపుర్‌లో ప్రధానంగా మూడు వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. మణిపుర్‌లోని 10 శాతం భూభాగంలో మెయితీలు, 90 శాతం ప్రాంతంలో నాగాలు, కుకీలు, ఇతర తెగల వాళ్లు ఉంటున్నారు.
ఇంఫాల్ లోయలోని మైదాన ప్రాంతంలో మెయితీ ప్రజలు అత్యధికంగా నివసిస్తున్నారు. మెయితీ కమ్యూనిటీలో ఎక్కువ మంది హిందువులు ఉండగా నాగ, కుకీ కమ్యూనిటీ ప్రజలు ప్రధానంగా క్రైస్తవ మతానికి చెందినవారు ఉన్నారు. మెయితీ జనాభా, రాజకీయ పరంగా పలుకుబడి ఎక్కువగా ఉందని మణిపుర్ గిరిజన సమూహాల వాదన. రాష్ట్రంలో మెయితీ ప్రజల ఆధిపత్యం ఉందని.. ఇక్కడి గిరిజన సంఘాలు భావిస్తున్నాయి. తెగ హోదాను వారు పొందినట్లయితే, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. మెయితీలు కొండ ప్రాంతాలలో కూడా భూమిని కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు.. ఆ క్రమంలో తమను మరింత అణచివేస్తారని భావిస్తున్నారు ఇతర వర్గాల ప్రజలు.
సుప్రీం కోర్టు ఈ ఘటనపై సీరియస్ అయిన అనంతరం... ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ‘మణిపూర్ ఘటన దేశానికి సిగ్గుచేటు, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై వారిని నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై యావత్ భారతదేశం భగ్గుమంది. ప్రతిపక్షాలు ప్రధాని మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశాయి. ఇక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ను మూసివేసింది, కర్ఫ్యూ విధించింది .."షూట్ ఎట్ సైట్ ఆదేశాలు" జారీ చేయడానికి అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లకు అధికారమూ ఇచ్చింది. కానీ ఈ చర్యలన్నీ పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు.
కాగా మెయితీ, కుకీ జాతి సమూహాల మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 150 మందికి పైగా మరణించారు. హింసలో వేలాది మంది గాయపడ్డారు. 60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 12,000 మందికి పైగా పొరుగున ఉన్న మిజోరాం రాష్ట్రానికి తరలిపోయారు. వేలాది మంది ఇళ్లు, ఊర్లు వదిలేసి నిరాశ్రయులుగా ప్రభుత్వ సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మెయితీ, కుకీ తెగలకు చెందినవారితోపాటు పోలీసులు, సైన్యం, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మే 3 వ తేదీ నుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు తెలుస్తోంది. మణిపూర్‌లోని పోలీసులకు చెందిన పోలీస్ స్టేషన్లు, ఆయుధాగారాలపై ఆందోళన కారులు దాడులు చేసి వేల సంఖ్యలో ఆయుధాలను దోచుకెళ్లినట్లు సమాచారం.
ఇక ఈ హింసాత్మక ఘటనలకు కారణమైన మెయితీ, కుకీ తెగలకు చెందిన వారితోనూ కేంద్ర హోంశాఖ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. మణిపూర్‌లో త్వరలో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఈ చర్చల ప్రక్రియ చివరి దశకు చేరుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. మణిపూర్ తగలబడుతుంటే ప్రధాని మోడీ మౌనంగా ఉండిపోవడాన్ని నిరసిస్తూ విపక్షాలు నిత్యం ఉభయసభల్లో ఆందోళనకు దిగుతున్నాయి. అయినా కేంద్రం మాత్రం దీనిపై సమగ్ర చర్చకు సిద్ధం కావడం లేదు. కేవలం స్వల్పకాలిక చర్చకు అంగీకరించిన కేంద్రం.. ప్రధాని మోడీ కాకుండా హోంమంత్రి అమిత్ షాతో ప్రకటన చేయిస్తామంటోంది. దీనికి విపక్షాలు అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. విపక్ష ఎంపీలు తమ డిమాండ్‌పై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
కాగా మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో కేంద్ర దర్యాపు సంస్థ విచారణ ప్రారంభించింది. సుప్రీం కోర్టులో అఫిడవిట్ నమోదైన రెండోరోజునే సీబీఐ ఈ కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచన మేరకు కేసును సిబిఐకి అప్పగించారు. ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులపై మణిపూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను, సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈ కేసులో న్యాయ విచారణను మణిపూర్‌లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో చేసేందుకు ఆదేశాలు ఇవ్వమని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం గతంలో అభ్యర్థించింది. ఈ విచారణను ఆరు నెలల్లో పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరింది. మణిపూర్‌లో వెలుగులోకి వచ్చిన ఆ ఘటనను కేంద్రం అత్యంత హేయమైనదిగా పరిగణిస్తుందని, న్యాయం జరిగేలా చూస్తేనే.. మహిళలపై ఇలాంటి నేరాలు తగ్గుతాయని, అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు చెలరేగి సరిగ్గా మూడు నెలలు అవుతోంది. మే 3వ తేదీన అక్కడ మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య హింస చెలరేగింది.