రాజకీయాల్లోకి రావడంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన రఘురాం రాజన్
నేను ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నాను. ప్రజలు దీన్ని నమ్మడంలేదు.
దిశ, నేషనల్ బ్యూరో: వివిధ సందర్భాల్లో భారత ఆర్థికవ్యవస్థ, ప్రభుత్వ నిర్ణయాలపై స్పందించే భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తాను రాజకీయాల్లో రావడంపై స్పందించారు. కొన్నాళ్లుగా ఆయన స్పందించే తీరు కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి. అయితే, రాజకీయాల్లోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..'నేను ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నాను. ప్రజలు దీన్ని నమ్మడంలేదు. నేను విద్యావేత్తను, నేను రాజకీయాల్లోకి రావడం నా భార్యతో పాటు కుటుంబానికి ఇష్టం లేదు. రాజకీయాల్లో ఉండటం, జనాల మధ్య ఉండటం అనేది తనకు నప్పదు. అందుకు బదులుగా తోచిన పద్దతిలో సాయం చేయాలని భావిస్తున్నాను. ప్రభుత్వంలో ఉన్నానా లేదా అనే దానితో సంబంధం లేకుండా వారి విధానాలు దారి తప్పుతున్నాయని అనిపించినప్పుడు తప్పకుండా మాట్లాడుతానని' ఆయన వివరించారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీతో ఉన్న సంబంధాలు, ఆయనకు సలహాల ఇస్తున్నారనే అంశంపై స్పందిస్తూ.. రాహుల్ గాంధీ తెలివైన వ్యక్తి. ధైర్యవంతుడు. ఆయనకు సలహాలు ఇచ్చాననడం పొరపాటు. నానమ్మను హత్య చేయడం, తండ్రిని పేలుళ్లలో కోల్పోవడాన్ని చూసిన కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడకూడదని భావిస్తున్నాను. కొవిడ్ మహమ్మారి సమయంలో రాహుల్ గాంధీ సరైన విధంగా వ్యవహరించాడని అనుకుంటున్నట్టు ' రఘురాం రాజన్ వెల్లడించారు.