మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ గెలుపు.. చైనా ఏమందంటే?
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు పార్టీ భారీ మెజార్టీ సొంతం చేసుకుంది. దీంతో మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకు విషెస్ చెప్పింది.
దిశ, నేషనల్ బ్యూరో: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు పార్టీ భారీ మెజార్టీ సొంతం చేసుకుంది. దీంతో మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకు విషెస్ చెప్పింది. చైనా- మాల్దీవుల సంబంధాలపైన.. బీజింగ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. సంప్రదాయ స్నేహాన్ని, సహకారాన్ని విస్తరించేందుకు మాల్దీవులతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని అన్నారు బీజింగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్.
చైనా-మాల్దీవుల మధ్య సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్నిబలోపేతం చేస్తామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడమే కాకుండా ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యం అని స్పష్టం చేశారు. పార్లమెంటరీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు మాల్దీవుల ప్రభుత్వాన్ని అభినందించారు. మాల్దీవుల ప్రజల ఎంపికను పూర్తిగా గౌరవిస్తున్నామని ప్రకటించారు వాంగ్ వెన్బిన్.
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్‌సీ) భారీ విజయాన్ని సొంతం చేసికుంది. మాల్దీవుల పార్లమెంటు (పీపుల్స్ మజ్లీస్) లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. ముయిజ్జుకు చెందిన పీఎన్‌సీ, ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) సహా ఆరు పార్టీలకు చెందిన 368 మంది బరిలో నిలిచారు.86 నియోజకవర్గాల ఫలితాలను ప్రకటించగా అందులో 60కి పైగా స్థానాలను పీఎన్‌సీ దక్కించుకుంది. మెజార్టీకి అవసరమైన సీట్లను ఆ పార్టీ ఇప్పటికే గెల్చుకుంది.