సుప్రీంకోర్టులో సీఎం కేజ్రీవాల్ సంచలన అఫిడవిట్.. టాప్ పాయింట్స్ ఇవే
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను కేంద్ర ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తోందనడానికి తనను అరెస్టు చేసిన సందర్భమే పెద్ద ఉదాహరణ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను కేంద్ర ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తోందనడానికి తనను అరెస్టు చేసిన సందర్భమే పెద్ద ఉదాహరణ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. తనను అరెస్టు చేయడం వల్ల ఆమ్‌ఆద్మీపార్టీకి ఎన్నికల వేళ తీరని నష్టం కలిగిందన్నారు. ఈడీని వాడుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో అక్రమ పద్ధతిలో పైచేయి సాధించిందని ఆయన తెలిపారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు సమాన పోరాట స్థాయి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టులో తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈవివరాలను సీఎం కేజ్రీవాల్ ప్రస్తావించారు. లిక్కర్ కేసులో తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో ఇటీవలే పిటిషన్ వేశారు. దీని విచారణ క్రమంలో ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌కు బదులిస్తూ ఆయన ఇప్పుడు మరోసారి అఫిడవిట్‌ను దాఖలు చేశారు.
ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోలేకపోయారు
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించకముందే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే తనను అరెస్టు చేసిన తీరు ఈడీ ఏకపక్ష వైఖరిని తెలియజేస్తోందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. మద్యం పాలసీ కేసుపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. దక్షిణాదికి చెందిన ఏ గ్రూప్ నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిధులు తీసుకున్నట్లుగా ఆధారాలు లేవన్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఈడీ ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోలేకపోయిందని ఢిల్లీ సీఎం చెప్పారు. తమకు విరాళాలే రానప్పుడు.. ఆ డబ్బును గోవా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించామనడం విడ్డూరంగా ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క రూపాయి కూడా రాలేదని, ఆధారాలు లేకుండా ఈ ఆరోపణలు చేశారన్నారు. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తిహార్ జైలులో ఉన్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి మనీష్ సిసోడియా కూడా ఏడాదిన్నర కాలంగా తిహార్ జైలులోనే ఉన్నారు.