West Bengal : పశ్చిమ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

ఉత్తర బెంగాల్ తో కూడిన ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతంలోని పలు వర్గాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

Update: 2024-08-05 14:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తర బెంగాల్ తో కూడిన ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతంలోని పలు వర్గాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తర బెంగాల్‌తో కూడిన ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆ రాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో , అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్బంగా.. వెస్ట్ బెంగాల్ సీఎం, మమతా బెనర్జీ ఈ తీర్మానం గురించి ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించే కేంద్ర ప్రయత్నాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని తాము నమ్ముతామని తెలిపారు.

అయితే.. ఈ తీర్మానానికి ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా తన మద్దతును తెలిపింది. తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారి మాట్లాడూతూ .. 'తాము దక్షిణ ప్రాంతాల అభివృద్ధితో సమానంగా ఉత్తర ప్రాంతాల అభివృద్ధిని కూడా కోరుకుంటున్నామని , రాష్ట్రాన్ని ముక్కలుగా విభజించే జరుగుతున్నప్రయత్నాన్ని మేమందరం వ్యతిరేకిస్తున్నామని' తెలిపారు. వెస్ట్ బెంగాల్‌ సమగ్ర అభివృద్ధి గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించాలని ప్రభుత్వాన్ని కోరారు.కాగా.. రాష్ట్ర విభజన ప్రయత్నాలకు వ్యతిరేకంగా గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో వాయిస్ ఓటింగ్ ద్వారా ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించారు.కేంద్ర ప్రభుత్వం ఉత్తర బెంగాల్ తో పాటుగా పొరుగు రాష్ట్రాలని విడగొట్టాలని చూస్తున్నట్లు తమకు సమాచారముందని టీఎంసీ పార్టీ ఆరోపిస్తోంది. 


Similar News