West Bengal Panchayat Election 2023: బెంగాల్‌ రీపోలింగ్‌లో 70% ఓటింగ్..

Update: 2023-07-10 16:32 GMT

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో ఆదివారం రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 5 జిల్లాల్లోని 697 బూత్‌లలో 69.85% ఓటింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. శుక్రవారం నాటి ఎన్నికల సందర్భంగా హింసాకాండ, ట్యాంపరింగ్, బ్యాలెట్ పత్రాలను కొల్లగొట్టడం, రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ తదితర ఫిర్యాదులు రావడంతో పోలింగ్ నిలిపివేసిన అధికారులు ఆదివారం రీపోలింగ్ నిర్వహించారు. నాలుగు బెటాలియన్ల కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత మధ్య సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ జరిగింది. జల్పాయిగురిలోని జుమ్మగచ్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఒక మహిళ క్యూబికల్ వద్ద నిలబడి మరో మహిళతో ఓటు వేయించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. జల్పాయిగురి జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నా ఓటు వేసేందుకు ప్రజలు గొడుగులు పట్టుకొని క్యూలో నిలబడటం విశేషం.

బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే హింస: టీఎంసీ

బీజేపీ నేతల రొచ్చగొట్టే ప్రసంగాల వల్లే పంచాయతీ ఎన్నికల్లో హింసాకాండ చెలరేగిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రీపోలింగ్ సందర్భంగా ముర్షిదాబాద్‌లో భద్రతా దళాల మోహరింపుపై ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం నాటి పోలింగ్ సందర్భంగా ఇంత భద్రత లేదని, దీంతో హింసాకాండ చెలరేగిందని స్థానికులు చెప్పారు. దక్షిణ 24 పరగణాలలోని బూత్‌ల వద్ద కూడా రీపోలింగ్ ఏర్పాట్లు బాగా చేశారని స్థానికులు చెప్పారు. పంజాబ్, బెంగాల్ పోలీసులను భారీ ఎత్తున మోహరించడంతో తాము నిర్భయంగా ఓటేశామని తెలిపారు.

కోట్లు కుమ్మరించే పంచాయతీలు..

పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాకాండపై బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించారు. పంచాయతీ ఎన్నికల్లో హింసాకాండ, అక్రమాలను నిరసిస్తూ కోల్‌కతాలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. ఈ హింసాకాండలో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 20 మంది చనిపోయారు. రాష్ట్రంలో 3,317 గ్రామ పంచాయతీ స్థానాలు, 63,283 పంచాయతీ సమితి స్థానాలు, 928 జిల్లా కౌన్సిల్ స్థానాలు ఉన్నాయి.

ఒక జిల్లా కౌన్సిల్‌కు ఐదేళ్లలో రూ.500 కోట్లు, ఒక గ్రామ పంచాయతీకి రూ.5-15 కోట్లు అందుతాయి. అదనంగా గ్రామీణాభివృద్ధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఏటా రూ.4 వేల కోట్లు అందుతాయి. కోట్లాది రూపాయల ఖజానా ఉండటంతో విజయం సాధించిన నాయకులు ఐదేళ్లలో కోట్లకు పడగలెత్తే అవకాశాన్ని వదులుకోవద్దన్న లక్ష్యంతో స్థానిక నాయకులు, పార్టీలు విజయం కోసం హింసాకాండకు సైతం పాల్పడుతున్నాయి.


Similar News