India-China Truce: ఎల్ఏసీ సయోధ్యపై కాంగ్రెస్ ఆరు ప్రశ్నలు

నాలుగేళ్లుగా ఉద్రిక్తతలు నెలకొన్న ఎల్ఏసీ పరిస్థితులు సద్దుమణగడానికి మార్గం సుగమమైందని, 2020కి ముందున్న యథాస్థితిలో పెట్రోలింగ్ నిర్వహించుకోవడానికి చైనాతో ఏకాభిప్రాయం కుదిరిందని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ తాజాగా సందేహాలను లేవనెత్తింది.

Update: 2024-10-23 13:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నాలుగేళ్లుగా ఉద్రిక్తతలు నెలకొన్న ఎల్ఏసీ పరిస్థితులు సద్దుమణగడానికి మార్గం సుగమమైందని, 2020కి ముందున్న యథాస్థితిలో పెట్రోలింగ్ నిర్వహించుకోవడానికి చైనాతో ఏకాభిప్రాయం కుదిరిందని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ తాజాగా సందేహాలను లేవనెత్తింది. దశాబ్దాల కాలంలో ఎదుర్కోనటువంటి దౌత్యపరమైన ఎదురుదెబ్బ.. గౌరవంగా సద్దుమణిగిందని భావిస్తున్నామని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ పేర్కొన్నారు. 2020 మార్చికి ముందున్న యథాస్థితిని తాము కోరుకుంటున్నామని వివరించారు. ఈ సందర్భంలోనే చైనాతో కుదిరిన ఏకాభిప్రాయానికి సంబంధించి ఆరు ప్రశ్నలు సంధించారు. దేశ ప్రజల కోసం ఈ ప్రశ్నలకు కేంద్రం సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు ప్రశ్నలు ఇలా ఉన్నాయి.

  • దెస్పాంగ్‌లో మనం చెప్పుకుంటున్న సరిహద్దు బాటిల్‌నెక్ జంక్షన్ దాటి ఐదు పెట్రోలింగ్ పాయింట్ల వరకు భారత జవాన్లు గస్తీ కాస్తారా?
  • గత నాలుగేళ్లుగా అందుబాటులో లేకుండా పోయిన దెంచోక్‌లోని మూడు పెట్రోలింగ్ పాయింట్ల వరకు మన సైనికులు వెళ్లుతారా?
  • ప్యాంగాంగ్ సోలో మన సైనికులు గతంలో ఫింగర్ 8 వరకు వెళ్లేవారు. ఇప్పుడు ఫింగర్ 3 వరకే పరిమితం అవుతారా? ఫింగర్ 8 వరకు వెళ్లుతారా?
  • గతంలో చేపట్టినట్టుగానే గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌లోని మూడు పెట్రోలింగ్ పాయింట్ల వరకు మన సైనికుల పెట్రోలింగ్‌ చేపడుతారా?
  • చుషుల్‌లోని హెల్మెట్ టాప్, ముక్పా రే, రెజాంగ్ లా, రించెన్ లా, టేబుల్ టాప్, గురుంగ్ హిల్‌లలో భారతీయులు సంప్రదాయంగా తమ పశువులను మేతకు తీసుకెళ్లేవారు. ఇప్పుడు కూడా వారు మేతకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందా?
  • చైనాకు మన ప్రభుత్వం అప్పగించిన ‘బఫర్ జోన్‌లు’ ఇక గతమేనా? ఈ బఫర్ జోన్‌లలోనే రెజాంగ్ లా నుంచి యుద్ధ వీరుడు, మరణానంతరం పరమవీర చక్ర అవార్డు పొందిన మేజర్ షైతానర్ సింగ్ స్మారకాలు ఉన్నాయి.
Tags:    

Similar News