ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసుకు సంబంధించి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి ఉమర్ ఖలీద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌

Update: 2023-07-12 15:30 GMT

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసుకు సంబంధించి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి ఉమర్ ఖలీద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను జూలై 24న విచారించాలని సుప్రీంకోర్టు బుధవారం నిర్ణయించింది. అయితే ఈ కేసులో తమ సమాధానం దాఖలు చేయడానికి ఢిల్లీ పోలీసులు సమయం కోరారు. ఢిల్లీ పోలీసుల తరఫున న్యాయవాది రజత్ నాయర్ వాదనలు వినిపిస్తూ.." సాధారణంగా సోమవారాలలో పోలీసులకు భారీ పనిభారం ఉంటుంది. విచారణ తేదీని మార్చాలి" అని కోర్టును కోరారు. న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై స్పందిస్తూ.. "ఏ రోజు ఎంత భారంగా ఉంటుందో మేం నిర్ణయిస్తాము. ఈ విషయం తేల్చడానికి 1 లేదా 2 నిమిషాలే పడుతుంది" అని వ్యాఖ్యానించింది.

దీనిపై ఖలీద్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.."ఆ వ్యక్తి రెండు సంవత్సరాలుగా (2020 సెప్టెంబర్ నుంచి) జైలులో ఉన్నాడు. ఇటువంటి టైంలో ఢిల్లీ పోలీసులు ఇలాంటి ఆన్సర్స్ ఇస్తున్నారు" అని పేర్కొన్నారు. న్యాయవాది రజత్ నాయర్ రెస్పాండ్ అవుతూ.."ఛార్జి షీట్‌లు వేల పేజీలలో ఉన్నాయి. దయచేసి ప్రత్యుత్తరం దాఖలు చేయడానికి మాకు కొంత సమయం ఇవ్వండి" అని కోర్టును కోరారు. ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు బెంచ్ ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్‌ పై జూలై 24న విచారణ నిర్వహిస్తామని వెల్లడించింది. కాగా, ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అంతకుముందు ఖలీద్‌ను 2020 సెప్టెంబర్‌లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2022 అక్టోబర్‌లో తనకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. ఖలీద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.


Similar News