Delhi: ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్యం.. 349కు చేరిన ఏక్యూఐ

దేశ రాజధానిలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. బుధవారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 349గా నమోదైంది.

Update: 2024-10-23 05:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. బుధవారం ఉదయం 7:30 గంటలకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 349గా నమోదైంది. దీనిని చాలా తీవ్ర మైన కేటగిరీగా పరిగణిస్తారు. అంతేగాక ఎన్సీఆర్ లోని పలు ప్రాంతాల్లో 400 కంటే ఎక్కువ ఏక్యూఐ నమోదైనట్టు తెలుస్తోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఏక్యూఐ 365, జహంగీర్‌పురిలో 417గా ఉంది, దట్టమైన పొగమంచు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఇక, ఇటీవలి కాలంలో అత్యంత కాలుష్య తీవ్రత నమోదైన అశోక్ విహార్‌లో ఏక్యూఐ కాస్త తగ్గి 359కి చేరకుంది. శీతాకాలం రాకముందే గాలి నాణ్యత పడిపోవడంతో ఢిల్లీ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఢిల్లీ, చుట్టుపక్కల నగరాల్లో వాయు కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం అప్రమత్తమైంది. గాలి నాణ్యతను నియంత్రించడానికి అధికారులు, పొరుగు రాష్ట్రాలు తీసుకోవలసిన కొన్ని చర్యలపై పలు సూచనలు చేసింది. ఢిల్లీకి డీజిల్ బస్సులను పంపొద్దని ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌ ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. నగరంలోని 97 రద్దీ కేంద్రాల్లో అదనంగా 1,800 మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ అంతటా నీటి స్ప్రేయింగ్ చేయిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కాలుష్యాన్ని నియంత్రించడానికి నాలుగు స్థాయిలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఏక్యూఐ 300 పైన ఉండగా ఢిల్లీలో స్టేజ్ IIను అమలు చేశారు.


Similar News