పరారీలో ‘భోలే బాబా’.. ఇంతకీ ఎవరాయన?

ఉత్తరప్రదేశ్‌ హత్రాస్ లోని ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరింది. కాగా.. సత్సంగ్ నిర్వహించిన ‘భోలే బాబా’ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Update: 2024-07-03 04:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌ హత్రాస్ లోని ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరింది. కాగా.. సత్సంగ్ నిర్వహించిన ‘భోలే బాబా’ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మెయిన్‌పురి జిల్లాలోని రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్ట్‌లో అధికారులు సోదాలు నిర్వహించారు. బాబా కనిపించలేదని డీఎస్పీ సునీల్ కుమార్ తెలిపారు. “ట్రస్ట్ క్యాంపస్ లో బాబా జీ కనిపించలేదు...అతను ఇక్కడ లేడు’’ అని ఆయన తెలిపారు. దీంతో, ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇకపోతే, 23 మంది డెడ్ బాడీలను అలీగఢ్ తరలించారు. అందులో 19 మందిని గుర్తించామని అధికారులు వెల్లడించారు.

ఎవరీ భోలే బాబా?

భోలే బాబాగా ప్రసిద్ధి చెందిన నారాయణ్ సాకార్‌ హరి సత్సంగంలో పెద్ద సంఖ్యలో భక్తులు అధికంగా పాల్గొనడంతో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, అసలు భోలే బాబా ఎవరు అనే విషయంపై అందరూ ఆరా తీస్తున్నారు. ఆయన పటియాలి తహసీల్‌లోని బహదూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్లుగా చెప్తూ ఉంటాడు. 17 ఏళ్ల పాటు ఇందులో పని చేసి.. 26 ఏళ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు గురువు కూడా ఎవరూ లేరని చెబుతుంటాడని స్థానికులు అంటుంటారు. సమాజం కోసం ఆధ్యాత్మిక బాట పట్టినట్లు చెబుతుంటాడట. తెల్లటి సూట్, టైతో ఆయన బోధనలు చేస్తుంటాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో సహా భారతదేశం అంతటా అతనికి మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. ముఖ్యంగా అనేక ఆధునిక మతపరమైన వ్యక్తుల మాదిరిగా కాకుండా, భోలే బాబా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కరోనా సమయంలోనూ ఈయన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చేవారు.

అలీగఢ్ లో ప్రతి మంగళవారం కార్యక్రమాల నిర్వహణ

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ లో ప్రతి మంగళవారం భోలే బాబా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. వేలాది మంది హాజరవుతారు. ఈ సమావేశాల సమయంలో వాలంటీర్లు భక్తులకు ఆహారం, మంచినీళ్లు సహా అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షించడం కొనసాగించినందుకు భోలే బాబా దృష్టిని ఆకర్షించారు. ఆయన భార్యతో కలిసి సత్సంగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2022 కొవిడ్ గైడ్ లైన్స్ ఉన్న సమయంలో సత్సంగ్ కోసం ఫరూఖాబాద్ అధికారులను అనుమతి అడిగారు. 50 మందితో సత్సంగ్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పాడు. కానీ 50 వేల మంది రావడంతో అధికారులు తలపట్టుకున్నారు.


Similar News