Wayanad landslides: 308కి చేరిన మృతుల సంఖ్య.. డ్రోన్ ఆధారిత రాడార్ తో రెస్క్యూ ఆపరేషన్

వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 308 మంది చనిపోయారు.

Update: 2024-08-02 04:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 308 మంది చనిపోయారు. కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయకచర్యలు కొనసాగుతోన్నాయి. నాలుగో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ సాంకేతికతను వాడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో దాదాపు వెయ్యి మందిని కాపాడారు. కాగా.. మరో 200 మందికి గాయలవ్వగా వారందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, కోస్ట్ గార్డ్, నేవీతో కూడిన సంయుక్త బృందం సహాయకచర్యలు కొనసాగిస్తోంది. నలభై బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చలియార్ నది పరిధిలోని 8 పోలీస్ స్టేషన్లలోని సిబ్బంది, గజఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే సహాయక చర్యల్లో ఆరు శునకాలు నిమగ్నమై ఉండగా.. మరో నాలుగింటిని తమిళనాడు నుంచి వయనాడ్ కు తీసుకురానున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వయనాడ్‌కు చేరుకున్న కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా.. సహాయకచర్యల విషయంలో పార్టీ నేతలతో సమావేశంకానున్నారు.

కేరళకు రెడ్ అలెర్ట్

రాబోయే రెండు రోజుల్లో వయనాడ్ సహా ఇతర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఇకపోతే, వయనాడ్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపాన్ని తెలిపారు. సహాయకచర్యల్లో పాల్గొన్న వారి నిబద్ధతను, ధైర్యసాహసాలను కొనియాడారు.


Similar News