Viral: రక్తదానం చేయను, కానీ ఫోటోకు ఫోజు ఇస్తా.. బయటపడ్డ మేయర్ బాగోతం

రక్తదానం చేస్తున్నట్లు నటించి ఫోటోలు తీయించుకున్న బీజేపీ మేయర్ బాగోతం బయటపడింది.

Update: 2024-09-20 10:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రక్తదానం చేస్తున్నట్లు నటించి ఫోటోలు తీయించుకున్న బీజేపీ మేయర్ బాగోతం బయటపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ప్రధాని మోడీ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. ఇందులో చాలా మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో మొరదాబాద్ పట్టణ మేయర్ వినోద్ అగర్వాల్ కూడా పాలు పంచుకున్నారు. అయితే ఆయన రక్తదానం ఇచ్చినట్లు ఫోటోలు దిగారు కానీ రక్తం ఇవ్వలేదు.

శిభిరంలోని ఏర్పాటు చేసిన బెడ్ పై పడుకొని, డాక్టర్ తో రక్తం ఇవ్వట్లేదని, కేవలం ఫోటోలు మాత్రమే దిగుతానని చెప్పి ఫోటోకు ఫోజు ఇచ్చాడు. అనంతరం బెడ్ పై నుంచి లేచి వెళ్లిపోయారు. అంతేగాక ఈ ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. రక్తదానం చేసి మీ బాధ్యతను నెరవేర్చండి అని రాసుకొచ్చారు. శిభిరంలో ఫోటోకు ఫోజులు ఇచ్చే సంఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేయగా.. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మొరదాబాద్ మేయర్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. అంతేగాక ఆయన ప్రజల సమస్యలు కూడా ఫోటోల మాదిరిగానే తీరుస్తారేమో అని కామెంట్లు పెడుతున్నారు. 


Similar News