భారత్ చేరుకున్న వినేశ్ ఫొగట్.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
పారిస్ ఒలింపిక్స్ లో మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరుకుంది.
దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరుకుంది. అయితే చివరి నిమిషంలో ఆమెను 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఒలిపింక్స్ నుంచి డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో భారత్ మరో పతకాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు లోనైన వినేశ్.. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె తనకు కనీసం సిల్వర్ మెడల్ అయిన ఇవ్వాలని.. (కాస్) సంప్రదించినప్పటికి అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో వినేశ్ ఫొగట్ శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న అభిమానులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఒలిపింక్స్ లో డిస్ క్వాలిఫై అయినప్పటికి ఆమెను పతకం సాధించిన రెజ్లర్ గానే పరిగణిస్తామని వారి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు ఆమె ఇండియాకు వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు పెద్ద మొత్తంలో ఎయిర్ పోర్టు సమీపానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రెజ్లర్లు సాక్షి, భజరంగ్ పునియా ఆమెకు స్వాగతం పలికి.. ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.