Vinesh Phogat Row In Parliament: వినేశ్ ఫొగాట్ ను అవమానించినట్లే..

వినేశ్ ఫొగాట్ పై రాజ్యసభ చర్చ జరిగింది. వినేశ్ అనర్హతకు దారితీసిన పరిస్థితులపై చర్చకు విపక్షాలకు పట్టుబట్టాయి. దీనికి ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ నిరాకరించడంతో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.

Update: 2024-08-08 08:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వినేశ్ ఫొగాట్ పై రాజ్యసభ చర్చ జరిగింది. వినేశ్ అనర్హతకు దారితీసిన పరిస్థితులపై చర్చకు విపక్షాలకు పట్టుబట్టాయి. దీనికి ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ నిరాకరించడంతో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. విపక్ష నేతల తీరుపై ఛైర్మన్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ‘‘వినేశ్‌పై అనర్హత పడినందుకు ప్రతిపక్షాలు మాత్రమే బాధపడుతున్నట్లు మాట్లాడుతున్నారు. ఆమె పరిస్థితి చూసి దేశమంతా ఆవేదన చెందుతోంది. కానీ, ఈ విషయాన్ని రాజకీయం చేస్తే ఆమెను అవమానపర్చినట్లే. ఆమె ప్రయాణం ఇంకా ఉంది” అని ధన్ ఖర్ అన్నారు. అంతకుముందు సభలో కేంద్రమంత్రి జేపీ నడ్డా దీనిపై మాట్లాడారు. ‘‘వినేశ్‌కు యావత్ దేశం అండగా ఉంది. ఆమె ఛాంపియన్లకే ఛాంపియన్‌ అని మోడీ అన్నారు. 140 కోట్ల మంది భావిస్తుంది కూడా అదే. దురదృష్టవశాత్తూ ఈ అంశాన్ని సభలో రాజకీయం చేస్తున్నాం. ఆమె విషయంలో కేంద్రం, క్రీడాశాఖ, భారత ఒలింపిక్‌ మండలి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తుంది’’ అని నడ్డా వివరించారు.

కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

సభలో అనర్హత అంశాన్ని లేవనెత్తడానికి ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ చీఫ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని అన్నారు. అయితే ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ఖర్గేకు రాజ్యసభ ఛైర్మన్ నుంచి అనుమతి లభించలేదు. మరోవైపు ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ రణ్‌దీప్‌ సుర్జేవాలా మాట్లాడుతూ.. ‘‘ఈ కష్ట సమయం నుంచి ఆమె కోలుకుని మళ్లీ బలంగా తిరిగొస్తుందని దేశమంతా విశ్వసిస్తోంది. కానీ కేంద్రం ఎందుకు దీనిపై మౌనంగా ఉంటోంది? చేజారిన ఆ పతకం వినేశ్‌ ఒక్కదానిదే కాదు.. మన దేశానిది. దీనిపై భారత ఒలింపిక్‌ సంఘం.. అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘంతో మాట్లాడాలి. ఆమెకు రజతం వచ్చేలా చూసే బాధ్యత కేంద్రానిదే’’ అని అన్నారు.


Similar News