'రిటర్న్ గిఫ్ట్' అని స్టేషన్లో ఇరగ్గొట్టారు.. అడిగితే, మాకేంతెలియదన్న పోలీస్ బాసు! (వీడియో)
వీడియో గురించి తమకు తెలియదని చెప్పడం విశేషం. Police Deny Knowledge Of "Return Gift" Video Of Torture.
దిశ, వెబ్‌డెస్క్ః రాజు తలచుకుంటే దెబ్బలకు కరువా అన్నట్లుంది ఉత్తర్‌ప్రదేశ్ ప్రజల పరిస్థితి. బిజెపి సీఎం యోగి ఆధిత్యానాథ్ అధికారంలో దళిత, మైనారిటీలపై హింస పెరిగిందని ఇప్పటికే ఆరోపణలు వస్తుంటే, ఇటీవల ఓ సంఘటన దానికి ఆజ్యం పోసింది. ఉత్తరప్రదేశ్ బిజెపి ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి ట్విట్టర్‌లో "అల్లర్లకు రిటర్న్ గిఫ్ట్" అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో, సహరాన్‌పూర్‌కి చెందిన కొందరు యువకుల్ని పోలీసులు కనికరం లేకుండా కొడుతుంటారు. దీన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన నాలుగు రోజుల తర్వాత, సంఘటన జరిగిన సహరాన్‌పూర్‌లోని పోలీసులు ఈ వీడియోపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో గురించి ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని, విచారణ జరగలేదని పోలీసులు బాధ్యత మరచి చెప్పడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
బిజెపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మ అభ్యంతరకరంగా మతపరమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత యూపీలో నిరసనలు చెలరేగాయి. అక్కడ యూపీ పోలీసులు నిరసనకారులపై లాఠీ ఝుళిపించారు. శాంతి, సామరస్యానికి భంగం కలిగించినందుకు వారిలో చాలా మందిని అదుపులోకి తీసుకున్న రెండు రోజుల తర్వాత ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇక, దీనిపై NDTVతో మాట్లాడిన శరణ్‌పూర్ సిటీ పోలీస్ సూపరింటెండెంట్, రాజేష్ కుమార్, వీడియో గురించి తమకు తెలియదని, ఏదైనా ఫిర్యాదు వస్తే చూస్తామని చెప్పడం విశేషం. అయితే, మీడియా పరిశోధనలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీడియోలో ఉన్న యువకుల్లో ఐదుగురి కుటుంబ సభ్యులు, ఈ ఘటన నిజంగానే సహరాన్‌పూర్‌కు చెందినదని, యువకులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పడం గమనార్హం. వీడియోలో ఉన్న యువకుల్లో ఒకరైన మహమ్మద్ అలీ సహరాన్‌పూర్‌లోని పీర్ గలిలో నివసిస్తుండగా, అదే వీడియోలో, తెల్లటి కుర్తా ధరించి మూలలో నిలబడి ఉన్న మరొక వ్యక్తి మహమ్మద్ సైఫ్ కూడా సహరాన్‌పూర్‌కు చెందినవాడిగా గుర్తించారు. వీడియోలో మహమ్మద్ సైఫ్ పక్కన నిలబడిన వ్యక్తి మహ్మద్ సఫాజ్. అతని సోదరుడు మహ్మద్ తౌహీద్ మీడియా ముందు కన్నీళ్ల పెట్టుకుంటూ.. పోలీసులు తనను దారుణంగా కొట్టారని వాపోయాడు. "నేను మా అన్నని జైలులో కలిశాను, అతని కాలు రక్తం కారుతోంది," అని చెప్పాడు.
సహరాన్‌పూర్‌కు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు రహత్ అలీ, ఇమ్రాన్‌లను కూడా పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ వ్యక్తులను కొట్టి నాలుగు రోజులు గడిచినా, సహరాన్‌పూర్‌లో ఇంకా ఎటువంటి విచారణ జరగకపోవడం విశేషం. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ వీడియో, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో కూడా తమకు తెలియదని పోలీసులు పేర్కొనడం విచిత్రంగా తోస్తోంది. ఇక, బాధిత కుటుంబాలు పోలీసులపై వ్రాతపూర్వక ఫిర్యాదు చేయడానికి చాలా భయపడుతున్నట్లు సమాచారం. అయితే, మరోవైపు, డేటాను పరిశీలిస్తే, 2020-21లో 8 పోలీసు కస్టడీ మరణాలు, 443 జ్యుడీషియల్ కస్టోడియల్ మరణాలతో సహా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యధిక కస్టడీ మరణాలను నమోదు చేసుకుంది.