Trump-Mask Interview: బైడెన్ ను ఘోరంగా ఓడించా

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ని బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేశారు.

Update: 2024-08-13 05:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ని బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేశారు. దాదాపు రెండుగంటలకుపైగా వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఇంటర్వ్యూలో డెమొక్రటిక్ ప్రత్యర్థి కమలా హ్యారిస్ పై విరుచుకుపడ్డారు. అలానే తనపై జరిగిన హత్యాయత్నం గురించి మాట్లాడారు. వైట్ హౌస్ రేసులో జో బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్ ఉన్నారు. అయితే, ఒపియన్ పోల్స్ లో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ కన్నా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నారు.

బైడెన్‌ను ఘోరంగా ఓడించా..

బైడెన్ తనతో జరిగిన బిగ్ డిబేట్ లో ఘోరంగా విఫలమయ్యారని ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడానికి డెమొక్రాట్ల తిరుగుబాటే కారణమని పేర్కొన్నారు. గతనెలలో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకున్నట్లు ప్రకటించారు. చర్చలో ఆయనను ఓడించడమే అందుకు కారణమని ట్రంప్ అన్నారు. ఇటీవల తనపై హత్యాయత్నం జరిగిన సమయంలో చెవికి దగ్గరగా బుల్లెట్‌ వచ్చినట్లు వెంటనే తెలిసిందని ట్రంప్ అన్నారు. అప్పట్నుంచే దేవుడిపైన నమ్మకాన్ని ఉంచానని పేర్కొన్నారు.

అక్రమ వలసలపై విమర్శలు

బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. నెలలో లక్షలాది మంది అక్రమ వలసదారులు దేశంలోకి చొరబడుతున్నారని మండిపడ్డారు. కమలా హ్యారిస్ అదో చేస్తున్నట్లు నటిస్తున్నారని అన్నారు. మూడున్నరేళ్లలో ఆమె ఏం చేయలేకపోయారని అన్నారు. వారికో మరో ఐదునెలల సమయం ఉన్నా ఏం చేయలేరని పేర్కొన్నారు. "దేశాలు తమ జైళ్లను ఖాళీ చేస్తున్నాయి. ఖైదీలను మన దేశానికి పంపుతున్నాయి. వారు నేరాలు, హింస చెలరేగాలని చూస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. బైడెన్, హ్యారిస్ ఉదాసీనత కారణంగానే అక్రమవలసలు పెరిగాయని వారిపై నిప్పులు చెరిగారు.

ద్రవ్యోల్బణం

కమలా హ్యారిస్ అధ్యక్షురాలిగా గెలిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందన్నారు.ఆమె శాన్ ఫ్రాన్సిస్కో ఉదారవాది అని.. ఆ నగరాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిస్తే దేశాన్ని నాశనం చేస్తారని మండిపడ్డారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. "అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. నాలుగేళ్ల క్రితం ప్రజలు డబ్బు ఆదాచేశారు. ఇప్పడు ఆ డబ్బంతా వాడుతున్నారు. జీవించేందుకు డబ్బుని అప్పుగా తీసుకుంటున్నారు” అని ట్రంప్ అన్నారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం గురించి ఏమన్నారంటే?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ , ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. వారు గేమ్ లలో టాప్ లో ఉన్నారని కొనియాడారు. వారంతా తమ దేశాలను ప్రేమిస్తున్నారని చెప్పారు. అయితే, వారిది భిన్నమైన ప్రేమ అని అన్నారు. వారిని ఎదుర్కోవడానికి అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బైడెన్‌ లేకపోయి ఉంటే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసేదే కాదని తెలిపారు. పుతిన్‌తో చాలా సార్లు మాట్లాడా అని.. ఆయన తనకు చాలా గౌరవమిస్తారని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ గురించి కూడా పలుసార్లు చర్చించుకున్నామని ట్రంప్‌ చెప్పారు.


Similar News