Houthis: హౌతీలపై అమెరికా వైమానికి దాడులు.. 24 మంది మృతి
అమెరికా ఎర్ర సముద్రంలో షిప్పింగ్ మార్గాల్లో దాడులకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుంది. హౌతీలపై వైమానిక దాడులు నిర్వహిస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఎర్ర సముద్రంలో షిప్పింగ్ మార్గాల్లో దాడులకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుంది. హౌతీలపై వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే యెమెన్ రాజధాని సనా, సదా ప్రావిన్స్‌లో అమెరికా చేపట్టిన భారీ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) హౌతీలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మీ సమయం ముగిసిందని, ఇకపై తీవ్రమైన ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. దీంతోపాటు ఇదే సమయంలో హౌతీలకు మద్దతునిచ్చే ఇరాన్‌పై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్ హౌతీలకు మద్దతు ఇవ్వడం వెంటనే ఆపేయాలని సూచించారు. అమెరికాకు ఏదైనా ముప్పు ఉంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. "అమెరికా మిమ్మల్ని పూర్తిగా జవాబుదారీగా ఉంచుతుంది. మేం దానిపైన తీవ్రంగా స్పందిస్తాం.. బాగా ఆలోచించుకోండి!" అని ఆయన హెచ్చరించారు. తమ లక్ష్యాన్ని సాధించే వరకు దాడులు తీవ్ర స్థాయిలో ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పట్నుండి దాడులు ఆగిపోవాలని.. లేదంటే, ఇంతకు ముందు చూడని విధంగా తమపై నరకం కన్నా మించిన బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
యెమెన్‌పై
శనివారం జరిగిన దాడుల్లో ఎర్ర సముద్రంలో ఉన్న హ్యారీ ఎస్ ట్రూమాన్ విమాన వాహక నౌక నుండి యుద్ధ విమానాలు పాల్గొన్నాయని అమెరికా అధికారులు తెలిపారు. మధ్యప్రాచ్యంలో సాయుధ దళాలను పర్యవేక్షించే యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్.. శనివారం దాడులు జరిగినట్లు స్పష్టం చేసింది. యెమెన్ అంతటా పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్రారంభం అయ్యిందని చెప్పుకొచ్చింది. అమెరికా చేపట్టిన వైమానిక దాడుల కారణంగా, సనాలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, సాదా ప్రావిన్స్‌లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా 11 మంది మరణించారు. అమెరికా దాడుల నేపథ్యంలో యెమెన్ ప్రజలు సైతం భయాందోళన చెందుతున్నారు. పేలుళ్లు భయంకరంగా ఉన్నాయని, అవి భూమిని కంపించేలా చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. దీంతో తమ పిల్లలతోపాటు అనేక మంది ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. మరోవైపు, హౌతీ ఈ దాడులను "యుద్ధ నేరం"గా అభివర్ణించింది. "మా యెమెన్ సాయుధ దళాలు తీవ్రతకు అనుగుణంగా స్పందించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి" అని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటనలో తెలిపారు.
గతంలో అమెరికాపై..
హౌతీలు గత దశాబ్దంగా యెమెన్‌లో పెద్దఎత్తున ప్రభావం చూపిస్తున్నారు. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలోని వ్యాపార నౌకలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతున్నారు. గత సంవత్సరం నుంచి హౌతీలు అమెరికా యుద్ధ నౌకలపై 174 సార్లు, వాణిజ్య నౌకలపై 145 సార్లు దాడులు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఇటీవల హౌతీలను "విదేశీ ఉగ్రవాద సంస్థ"గా ప్రకటించింది.