Bangladesh Violence: విధ్వంసానికి ముగింపు పలకాలి

బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి భారత్‌ సహా ఇతరదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు.

Update: 2024-08-15 04:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి భారత్‌ సహా ఇతరదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు. బంగ్లాదేశ్ లో విధ్వంసానికి స్వస్తి చెప్పాలని పేర్కొన్నారు. మేదాంత్ పటేల్ మాట్లాడుతూ.. " ప్రైవేట్ దౌత్య చర్చలకు వెళ్లడం లేదు. కానీ బంగ్లాదేశ్‌లో హింసను అంతం చేయడం, జవాబుదారీతనం, చట్టాన్ని గౌరవించడం కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్‌ హింసపై చర్చించడానికి భారత్ సహా ఇతర దేశాలతో టచ్ లో ఉన్నాం" అని చెప్పారు.

హింసకు ముగింపు పలకాలని పిలుపు

బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ ప్రకటనను కూడా ఆయన స్వాగతించారు. ప్రశాంతంగా ఉండాలని, హింసకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. మైనారిటీ వర్గాల భద్రత, రక్షణపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టడం మంచివిషయమన్నారు. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందూ సమాజాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని హిందూ-అమెరికన్ ఫౌండేషన్ బుధవారం వైట్‌హౌస్‌ను కోరింది. బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని.. వారి దుస్థితిపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆరోపించారు. మైనారిటీలైన హిందువులపై దాడులు జరిగితే.. బంగ్లాదేశ్ మరో తాలిబన్ దేశంగా మారుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Similar News