Lawyer : ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన లాయర్.. రంగంలోకి కుల సంఘాలు
దిశ, నేషనల్ బ్యూరో : ఒక లాయర్.. స్థానిక ఎమ్మెల్యేను అందరి ముందే చెంపదెబ్బ కొట్టిన వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లో సామాజిక దుమారం రేపుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో : ఒక లాయర్.. స్థానిక ఎమ్మెల్యేను అందరి ముందే చెంపదెబ్బ కొట్టిన వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లో సామాజిక దుమారం రేపుతోంది. ఈనెల 9న లఖీంపూర్ ఖేరీ జిల్లాలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు(యూసీబీ) నామినేషన్లను స్వీకరించారు. లఖీంపూర్ ఖేరీ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అడ్వకేట్ అవదేశ్ సింగ్ సతీమణి పుష్పా సింగ్ కూడా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. గతంలో యూసీబీ ఛైర్‌పర్సన్‌గానూ ఆమె సేవలను అందించారు. ఈసందర్భంగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మ, ఆయన అనుచరులు పుష్పా సింగ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే అభియోగాలు ఉన్నాయి. తన సతీమణిపై బహిరంగ విమర్శలు చేస్తుండటాన్ని సహించలేకపోయిన అడ్వకేట్ అవదేశ్ సింగ్ ఎమ్మెల్యే యోగేశ్ వర్మను చెంపదెబ్బ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ వివాదం కుల రంగును పులుముకుంది.
అడ్వకేట్ అవదేశ్ సింగ్ తరఫున కర్ణిసేన రంగంలోకి దిగింది. తమ కులానికి చెందిన అవదేశ్ సింగ్ ఎంతో సాహసి అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తోంది. దసరా సందర్భంగా కర్ణిసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ‘శస్త్ర పూజ’ కార్యక్రమానికి అవదేశ్ సింగ్‌ను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి అవదేశ్ వెళ్లగా.. అందరూ ‘షేర్ ఆయా షేర్ ఆయా’ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మకు మద్దతుగా పటేల్ సేవా సంస్థాన్ రంగంలోకి దిగింది. ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టినందుకు అడ్వకేట్ అవదేశ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు లఖీంపూర్ ఖేరీ జిల్లా ఎస్పీకి మెమొరాండం సమర్పించారు. దీనిపై బీజేపీ కూడా సదరు అడ్వకేట్‌కు షోకాజ్ నోటీసును పంపింది. ఇరువైపుల నుంచి మూడు ఫిర్యాదులు పోలీసులకు వెళ్లినప్పటికీ.. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.