Gold Smuggling :‘గోల్డ్ స్మగ్లింగ్’ మాఫియా గురించి నాకు చెప్పరా ?.. కేరళ సీఎంపై గవర్నర్ ఆరిఫ్ భగ్గు
దిశ, నేషనల్ బ్యూరో : మలప్పురం జిల్లా కేంద్రంగా సాగుతున్న గోల్డ్ స్మగ్లింగ్ దందా ఆందోళన కలిగిస్తోందంటూ కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలను గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రంగా పరిగణించారు.
దిశ, నేషనల్ బ్యూరో : మలప్పురం జిల్లా కేంద్రంగా సాగుతున్న గోల్డ్ స్మగ్లింగ్ దందా ఆందోళన కలిగిస్తోందంటూ కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలను గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రంగా పరిగణించారు. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే రీతిలో బంగారం స్మగ్లింగ్ జరుగుతోందన్న సీఎం.. ఆ ముఖ్యమైన విషయాన్ని తనకు తెలియజేయకపోవడం దారుణమన్నారు. ‘‘ఇలాంటి అంశాలను రాష్ట్రపతికి తెలియజేయడం నా బాధ్యత కాదా ?’’ అని గవర్నర్ ప్రశ్నించారు. ‘‘ఈ సున్నితమైన అంశంపై సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేదనే దానిపై సీఎంను నేను వివరణ కోరకూడదా ?’’ అని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్కొన్నారు.
‘‘మలప్పురం గోల్డ్ స్మగ్లింగ్‌పై నేను ప్రశ్నించడం మొదలుపెట్టగానే సీఎం విజయన్ స్వరం మార్చారు. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలు అనే పదాలే తాను వాడలేదంటూ నాకు లేఖ పంపారు’’ అని గవర్నర్ మండిపడ్డారు. ‘‘మలప్పురం గోల్డ్ స్మగ్లింగ్ ముఠాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని.. పన్నుల ఎగవేతకు అవకాశం కలుగుతుందని అదే లేఖలో సీఎం విజయన్ ప్రస్తావించారు. వాటి సంగతేంటి?’’ అని కేరళ ముఖ్యమంత్రిని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రశ్నించారు.