ఛత్తీస్ గఢ్ విజయమే స్ఫూర్తి.. వామపక్ష ఉగ్రవాదంపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

హింసతో ఏదీ సాధించలేరని, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సీఎంలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Update: 2024-10-07 07:58 GMT

దిశ, వెబ్ డెస్క్: మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలపై ఫోకస్ పెట్టామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, అధికారులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో మావోయిస్టుల తీవ్రవాదం తుది దశకు చేరిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 13 వేల మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలేశారని తెలిపారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకూ 202 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మరణించగా.. మరో 723 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వివరించారు. దేశాన్ని మావోయిస్ట్ రహిత దేశంగా మార్చేందుకు కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సహకరించాలని కోరినట్లు చెప్పారు.

ఛత్తీస్ గఢ్ విజయమే ప్రేరణ

మావోయిస్టులను అంతమొందించడమే లక్ష్యమన్న అమిత్ షా.. మరింత స్ఫూర్తితో ముందుకెళ్తామన్నారు. ఇటీవల ఛత్తీస్ గఢ్ లో జరిగిన మావోయిస్టుల భారీ ఎన్కౌంటరే అందరికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ విజయాన్ని సాధించిన ఛత్తీస్ గఢ్ సీఎం, డీజీపీని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్ గఢ్ లో కొందరు మావోయిస్టులు లొంగిపోయినట్లు చెప్పారు.

వికసిత్ భారత్ ను సాధించాలంటే అందులో మన ట్రైబల్స్ కూడా భాగం కావాలన్నారు అమిత్ షా. కానీ ట్రైబల్స్ కు ప్రభుత్వ ఫలాలు అందకుండా మావోయిస్టులు అడ్డుకుంటున్నారని.. రోడ్లు, టవర్లు, విద్య, వైద్యం కూడా గిరిజన ప్రాంతాలకు చేరకుండా చేస్తున్నారని ఆరోపించారు. గడిచిన కొన్నేళ్లుగా మావోయిస్టుల సమస్యను ఎదుర్కొనడంలో పరుగోతి సాధించామని తెలిపారు. 2022లో తొలిసారి జరిగిన మావోయిస్టు హింస కారణంగా 100 కంటే తక్కువ మరణాలు నమోదయ్యాయని, అప్పటి నుంచి బహుముఖ వ్యూహంతో వారిని ఎదుర్కొంటున్నట్లు వివరించారు. మావోయిస్టులను ఎదుర్కొనడంలో ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలు సైతం మెరుగ్గా పనిచేస్తున్నాయన్నారు.

వామపక్ష ఉగ్రవాదంపై పై చేయి

ఈ ఏడాది ఛత్తీస్ గఢ్ లో జరిగిన కాల్పుల్లో వామపక్ష ఉగ్రవారంపై పై చేయిసాధించామన్నారు. పోలీస్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు చాలా బాగా పనిచేశాయన్నారు. హింసతో ఏదీ సాధించలేరని, జనజీవన స్రవంతిలో కలవాలని అమిత్ షా మావోయిస్టులకు పిలుపునిచ్చారు. వామపక్ష తీవ్రవాదం అతిమ దశలో ఉందన్న ఆయన.. అభివృద్ధిని దేశంలోని మారమూలప్రాంతాలకు తీసుకెళ్లాలంటే దానిని అణచివేయక తప్పదన్నారు. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేస్తే.. పెద్ద సమస్యకు పరిష్కారం చూపించినట్లు ఉంటుందన్నారు.

రూ.3006 కోట్లు ఖర్చు చేశాం

దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదంతో అనుసంధానమై ఉన్న యువత ఆయుధాలను వదిలేసి ప్రజల్లోకి రావాలని అమిత్ షా పిలుపునిచ్చారు. నక్సలిజం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని గుర్తించి.. సహకరించాలని కోరారు. 2014 నుంచి ఇప్పటి వరకూ వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రూ.3006 కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. 11,500 కిలోమీటర్ల రోడ్డుకు నెట్, 15,300 మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఏకలవ్య స్కూళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. నక్సలిజం ప్రజలకు వ్యతిరేకమని, త్వరలోనే నక్సల్ ప్రభావిత జిల్లాలు తగ్గుతాయని భావిస్తున్నామని పేర్కొన్నారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీ 15 రోజులకొకసారి నక్సల్ నిర్మూలనపై రివ్యూ మీటింగ్ నిర్వహించాలని అమిత్ షా ఆదేశించారు. అలాగే డీజీపీలు మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో పర్యటించాలని, 2026 నాటికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నక్సలిజాన్ని నిర్మూలించాలన్నారు. 


Similar News