పంజాబ్ గవర్నర్-ముఖ్యమంత్రి మధ్య లేఖల యుద్ధం..

అధికారుల మధ్య కానీ, ప్రజాప్రతినిధుల మధ్య కానీ మాటల యుద్ధం చూశాం.

Update: 2023-02-23 16:40 GMT

చండీగఢ్: అధికారుల మధ్య కానీ, ప్రజాప్రతినిధుల మధ్య కానీ మాటల యుద్ధం చూశాం. కానీ పంజాబ్‌లో లేఖల యుద్ధం నడుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను ప్రశ్నిస్తూ ఫిబ్రవరి 13వ తేదీన ముఖ్యమంత్రి భగవంత్ మన్‌కు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ లేఖ రాయడంతో ఈ గొడవ మొదలైంది. సింగపూర్‌లో స్కూల్ ప్రిన్సిపాళ్లకు శిక్షణ విషయంలో తనకు ఫిర్యాదులు అందుతున్నాయని.. ప్రయాణ ఖర్చులు, శిక్షణ, వసతితో పాటు సెలెక్షన్ ప్రక్రియ గురించిన పూర్తి వివరాలు తెలపాలని తాజాగా ముఖ్యమంత్రికి గవర్నర్ లేఖ రాశారు. ఇక్కడే అసలు గొడవ మొదలైంది.

దానికి ముఖ్యమంత్రి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. 'గౌరవనీయులైన గవర్నర్ గారికి.. మీడియా ద్వారా మీ లేఖ అందింది. లేఖలో మీరు పేర్కొన్న అంశాలన్నీ రాష్ట్రానికి చెందినవి. అంటే చట్టరీత్యా నా ప్రభుత్వం 3 కోట్ల మంది పంజాబ్ ప్రజలకు జవాబు చెబుతుంది. అంతేకానీ కేంద్రం నియమించిన గవర్నర్‌కు కాదు. మీ లేఖకు ఇదే నా సమాధానంగా భావించండి. సింగపూర్‌లో శిక్షణకు ప్రిన్సిపాల్స్‌ను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారని మీరు నన్ను అడుతున్నారు.

భారత దేశంలో నిర్దిష్ట విద్యార్థత లేకపోయినా వివిధ రాష్ట్రాల గవర్నర్‌లను ర్యాజ్యాంగంలోని దేని ప్రాతిపదికన కేంద్రం ఎన్నుకుంటోందని ప్రజలు అడగాలనుకుంటున్నారు. దయచేసి దీనికి సమాధానం చెప్పి పంజాబీయుల జ్ఞానాన్ని పెంచండి' అని మన్ సమాధానమిచ్చారు. దీనికి ఆగ్రహించిన గవర్నర్.. 'మీ ట్విట్, లేఖ రెండు రాజ్యాంగ విరుద్ధంగా, అవమానకరంగా ఉన్నాయి. కనుక నేను న్యాయ సలహా తీసుకోవాల్సి వస్తోంది. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే మీ ప్రశ్నకు సమాధానమిస్తాను' అని చెప్పారు.

Tags:    

Similar News