Manipur: మణిపూర్ ఘర్షణల్లో కాలిన ఇద్దరు మెయితీ వృద్ధుల మృతదేహాలు లభ్యం
మరో ఆరుగురి ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు మంగళవారం తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. పలు కుకీ-జో సంస్థలు పిలుపునిచ్చిన కర్ఫ్యూ, సాధారణ షట్‌డౌన్ ఘర్షణల మధ్య మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో ఇద్దరు మెయితీ వర్గానికి చెందిన వృద్ధుల కాలిన మృతదేహాలను కనుగొన్నారు. అదే జిల్లాలో మరో ఆరుగురి ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు మంగళవారం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్, సీఆర్‌పీఎఫ్ శిబిరంపై దాడి చేసిన 10 మంది సాయుధ దళాలను చంపిన తర్వాత రెండు మృతదేహాలను కొనుగొన్నామని మణిపూర్ పోలీస్ ఉన్నతాధికారి ఐకె మువా చెప్పారు. ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల ఆచూకీ కోసం అన్వేషిస్తున్నామని ఆయన వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు పేర్కొన్నారు. జిరిబామ్‌లో కుకీ-జో తీవ్రవాదులు అపహరించినట్లు అనుమానిస్తున్న ఆరుగురు వ్యక్తుల ఆచూకీ కోసం డిమాండ్ చేస్తూ మెయితీ సంస్థలు బుధవారం ఇంఫాల్ లోయలో సాధారణ షట్‌డౌన్ ప్రకటించాయి. కుకీ-జో మిలిటెంట్లు దుకాణాలు, ఇళ్లకు నిప్పంటించడంతో ఇద్దరు వ్యక్తులు లైష్రామ్ బాలెన్, మైబామ్ కేషో మరణించారని వారు స్పష్టం చేశారు. ఈ హత్యలపై కుకీ-జో కమ్యూనిటీలలో ఆగ్రహం పెరగడంతో, కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (కేఎస్ఓ) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది తమ శిబిరాల నుంచి బయటకు వెళ్లవద్దని చెప్పారు. తమ నోటీసును ఉల్లంఘిస్తే అది వారి వారి స్వంత బాధ్యత అని పేర్కొన్నారు. కాగా, గతేడాది మే నుంచి మణిపూర్‌లో మెయితీ-కుకీ వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. వీరి ఘర్షణల కారణంగా ఇప్పటివరకు దాదాపు 240 మంది మరణించారు. 60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. సైన్యంతో సహా పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు ఉన్నప్పటికీ చెదురుమదురు హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.