రైలు ప్రమాదంలో తెగిపోయిన రెండు చేతులు.. మరో మహిళ చేతులు అతికించిన వైద్యులు
ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి వైద్యులు రెండు చేతులు లేని ఓ వ్యక్తికి మరో మహిళకు చెందిన చేతులను విజయవతంగా అతికించారు.
దిశ, డైనమిక్ బ్యూరో:వైద్యరంగం అభివృద్ధి చెందాక అసాధ్యం అనుకున్నవన్ని డాక్టర్లు సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి వైద్యులు రెండు చేతులు లేని ఓ వ్యక్తికి మరో మహిళకు చెందిన చేతులను విజయవతంగా అతికించారు. ఈ క్లిష్టతరమైన ఆపరేషన్ ను సుమారు 12 గంటల పాటు శ్రమించారు. 45 ఏళ్ల ఓ పెయింటర్ 2020లో జరిగిన రైలు ప్రమాదంలో మోచేతి వరకు తన రెండు చేతులను కోల్పోయాడు. నిరుపేద కుటుంబ నేపథ్యంలో కలిగిన పెయింటర్ తన పట్ల విధి ఆడిన నాటకంతో చేతులు లేకుండానే కాలం వెల్లదీస్తున్నాడు. ఈ క్రమంలో సౌత్ ఢిల్లీ స్కూల్‌లో పనిచేస్తున్న మీనా మెహతా ఇటీవల బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో వైద్యులు సదరు మహిళ రెండు చేతులను పెయింటర్ కు అతికించారు.
ఈ ఆపరేషన్ లో వైద్యులు దాత చేతులు, గ్రహీత చేతుల మధ్య ఉన్న ప్రతి ధమని, కండరం, స్నాయువు, నరాలను ఎంతో శ్రమించి ఒకటిగా కలిపారు. సర్జరీ తర్వాత డాక్టర్లతో ఫోటో దిగిన సమయంలో ఆ పెయింటర్ తన చేతులతో థమ్స్ అప్ సంకేతం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేపు ఆసుపత్రి నుంచి ఆ పెయింటర్ కొత్త చేతులతో డిశ్చార్జ్ కాబోతున్నాడు. మెడికల్ హిస్టరీలో ఇండియన్ డాక్టర్లు చేస్తున్న అద్భుతాలను చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా బ్రెయిన్ డెడ్ అయిన సదరు మహిళకు చెందిన మూత్రపిండాలు, కాలేయం, కార్నియాలను వైద్యులు మరో ముగ్గురికి ట్రాన్స్ ఫ్లాంట్ చేశారు.