కెనడా పార్లమెంట్‌లో నిజ్జర్‌కు నివాళి.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్

కెనడా పార్లమెంట్ మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ మరణించి ఏడాది పూర్తయిన సందర్బంగా కొద్దిసేపు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

Update: 2024-06-19 07:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా పార్లమెంట్ మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ మరణించి ఏడాది పూర్తయిన సందర్బంగా కొద్దిసేపు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఇప్పటికే భారత్-కెనడా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కెనడా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే దీనికి భారత్‌ కూడా గట్టిగానే బదులిచ్చింది. సోషల్ మీడియా ఎక్స్‌లో వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం, 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానంపై ఖలిస్తానీ బాంబు దాడిలో మరణించిన 329 మంది వ్యక్తులకు నివాళలర్పిస్తున్నట్లు పోస్ట్ చేసింది. అలాగే, ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో భారతదేశం ముందంజలో ఉంది, ఈ ప్రపంచ ముప్పును పరిష్కరించడానికి అన్ని దేశాలతో కలిసి పనిచేస్తుంది. ఎయిర్ ఇండియా కనిష్క విమానంపై దాడికి 23 జూన్ 2024 నాటికి 39 ఏళ్లు పూర్తయ్యాయి, ఇందులో 86 మంది చిన్నారులతో సహ ఇతర అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు, పౌర విమానయాన చరిత్రలో ఇది అత్యంత ఘోరమైన ఉగ్రవాద పిరికిపంద చర్య అని పేర్కొంది.

గత ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారా వెలుపల కెనడాలోని సర్రేలో జరిగిన కాల్పుల్లో హర్దీప్ సింగ్ చీఫ్ నిజ్జర్ మరణించాడు. ఇదిలా ఉంటే భారత్‌ విడుదల చేసిన 40 మంది తీవ్రవాదుల జాబితాలో హర్దీప్ సింగ్‌ నిజ్జర్ పేరు కూడా ఉండటం గమనార్హం. నిజ్జర్ హత్యతో భారత్‌కు సంబంధం ఉందని కెనడా ఆరోపణలు చేయడంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి.


Similar News