వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్ కర్ కారు సీజ్..!
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్ కర్ ఆడి కారుని పూణే ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూజాపై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.
దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్ కర్ ఆడి కారుని పూణే ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూజాపై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. కాగా.. పూణే ట్రాఫిక్ పోలీసులు ఆమె వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమె వాహనంపై అనుమతి లేకుండా వీఐపీ నంబర్ ప్లేట్ తో పాటు బీకాన్ ను వాడారు. అంతేకాకుండా, ఆ వాహనంపై మొత్తం 21 ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. రూ.26వేలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి డ్రైవర్ చతుష్రింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి కారుని అందజేశాడు. ఇకపోతే, కారు పత్రాలను సమర్పించాలని పూజా కుటుంబసభ్యులకు ట్రాఫిక్ పోలీసు విభాగం నోటీసు జారీ చేసింది. అయితే, ఇప్పటి వరకు ట్రాఫిక్ విభాగానికి పత్రాలు సమర్పించలేదు.
పూజాపై ఆరోపణలు
పూణేలో అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు ప్రత్యేక కార్యాలయం, అధికారిక వాహనం, సిబ్బంది వంటి ప్రత్యేక అధికారాలు డిమాండ్ చేసినట్లు పూజాపై ఆరోపణలు వచ్చాయి. ఈ సౌకర్యాలు సాధారణంగా ప్రొబేషనరీ అధికారులకు మంజూరు చేయరు. మరోవైపు, దివ్యాంగుల కోటా, ఓబీసీ కోటాను దుర్వినియోగం చేశారని విమర్శలు వస్తున్నాయి. పూజకు దృష్టిలోపం ఉందని ధ్రువపత్రాల్లో ఉందని అధికారులు పేర్కొన్నారు. కానీ ఆరు సార్లు శారీరక పరీక్షను దాటవేసినట్లు వెల్లడించారు. దూకుడుగా వ్యవహరిస్తున్నారని పూణే జిల్లా కలెక్టర్ చీఫ్ సెక్రటరీకి నివేదిక అందించడంతో పూజ ఖేడ్ కర్ ను వాషిమ్‌కు బదిలీ చేశారు. దీంతో, ఈ వివాదం బయటకొచ్చింది. పూజా యూపీఎస్సీ రిక్రూట్ మెంట్ పై వచ్చిన ఆరోపణలపై కేంద్రం విచారణ చేపట్టింది. దర్యాప్తు చేసేందుకు ఏకసభ్య ప్యానెల్ ను ఏర్పాటు చేసింది.