జరిగిన పరిణామాలపై మాట్లాడేందుకు నిరాకరించిన ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్

పూజా ఖేద్కర్ వ్యవహారంపై ప్రధాని కార్యాలయం కూడా ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశాలిచ్చింది

Update: 2024-07-11 13:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అనవసర ఆడంబరాలకు పోయి వివాదంలో చిక్కుకున్న ట్రెయినీ కలెక్టర్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తన ప్రైవేట్ కారుకు సైరన్, ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్‌లను వాడినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ట్రెయినీగా ఉన్న సమయంలో ఆమెకు ఇలాంటి సౌకర్యాలు ఉండవు. దాంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాషిమ్‌కు బదిలీ చేసింది. తాజాగా వాషిమ్‌లో ఆమె విధుల్లో చేరారు. అయితే, పూజా ఖేద్కర్ ఉద్యోగం కోసం ఓబీసీ సర్టిఫికేట్‌తో పాటు కంటి, మానసిక సమస్యలు ఉన్నాయని నకిలీ డాక్యుమెంట్లు సమర్పించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ అంగవైకల్యం సర్టిఫికేట్ ద్వారా ఆమె ఉద్యోగం పొందారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూజా ఖేద్కర్ వ్యవహారంపై కేంద్రంలో ప్రధాని కార్యాలయం కూడా ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశాలిచ్చింది. ఈ పరిణామాలపై ఆమె మీడియా మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. 'తనకు ఈ అంశంపై మాట్లాడేందుకు అనుమతి లేదు. నిబంధనలు అందుకు అనుమతించవు. వాషిమ్‌లో కొత్త బాధ్యతలు చేపట్టడం తనకు సంతోషంగానే ఉందని ' పూజా ఖేద్కర్ చెప్పారు. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం, అధికారులకు శిక్షణ ఇచ్చే ముస్సోరీకి చెందిన లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(ఎల్‌బీఎస్ఎన్ఏఏ) రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు కోరింది. యూపీఎస్‌సీ పరీక్షల్లో ఆల్ ఇండియా 821వ ర్యాంక్ సాధించిన డా పూజా ఖేద్కర్ 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఓబీసీ, పీడబ్ల్యూబీడీ విభాగాల కింద ఐఏఎస్ అయ్యారు. ఆమె తండ్రి మహారాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ అధికారి దిలీప్ ఖేద్కర్ కావడం గమనార్హం. 


Similar News