Waqf board: 1500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డ్ వివాదం.. ఆందోళనకు దిగిన రైతులు

ఏకంగా 1500 ఎకరాల సాగు భూమి తమదేనని వక్ఫ్ బోర్డ్ (Waqf board) ప్రకటన చేయడం స్థానికంగా దుమారం రేపింది.

Update: 2024-10-27 05:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏకంగా 1500 ఎకరాల సాగు భూమి తమదేనని వక్ఫ్ బోర్డ్ (Waqf board) ప్రకటన చేయడం స్థానికంగా దుమారం రేపింది. తమ పూర్వీకుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని వక్ఫ్ బోర్డ్ తమదిగా ఎలా ప్రకటిస్తుందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని విజయపుర జిల్లా హోన్వాడ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో రైతులంతా ఆందోళనలకు దిగారు. ఉన్నట్లుండి తహసీల్దార్ (Tehsildar) కార్యాలయం నుంచి తమకు నోటీసులు రావడంతో షాకయ్యామని, తరతరాలుగా తమ ఆస్తిగా ఉన్న ఈ భూమిని ఉన్నట్లుండి వక్ఫ్ బోర్డ్ కాజేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. భూమి పట్టాల్లో కూడా అక్రమంగా మార్పులు చేశారని ఆరోపిస్తూ ఏకంగా తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ భూమి వక్ఫ్ బోర్డుదని ప్రకటించడంతో ఇప్పుడు బ్యాంకులు కూడా తమకు లోన్లు ఇవ్వడం లేదని, కనీసం ఈ భూమిని అమ్మాలన్నా అమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఈ వ్యవహారంలో బీజేపీ (BJP) ఎంపీ తేజస్వి సూర్య (Tejaswi Surya) కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ పేరుతో స్థానిక మంత్రి ఈ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. దీనిపై మంత్రి జమీర్ (Minister Zameer) కూడా ఘాటుగా స్పందిస్తూ.. బీజేపీ ఈ వ్యవహారాన్ని కావాలనే రాజకీయం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వక్ఫ్ చేతిలో లక్షా 12 వేల ఎకరాల భూమి ఉందని, కానీ ప్రస్తుతం కేవలం 23 వేల ఎకరాలు మాత్రమే వక్ఫ్ ఆధీనంలో ఉందని చెప్పారు. రైతుల భూములు లాక్కునే ఉద్దేశం వక్ఫ్ బోర్డుకు ఉండదని, దీనిపై న్యాయంగా పోరాడతామని చెప్పారు. 


Similar News