విషాదం మిగిల్చిన తుపాను.. నగదు కోసం ఏటీఎంకు వెళ్లి వ్యక్తి మృతి
తీరందాటిన ఫెయింజల్ (Fengal Cyclone).. క్రమంగా బలహీన పడుతోంది. చెన్నై నగరాన్ని ముంచేసిన ఈ సైక్లోన్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేయడానికి వెళ్లిన వ్యక్తి.. ప్రాణాలు కోల్పోయాడు.
దిశ, వెబ్ డెస్క్: తీరందాటిన ఫెయింజల్ (Fengal Cyclone).. క్రమంగా బలహీన పడుతోంది. చెన్నై నగరాన్ని ముంచేసిన ఈ సైక్లోన్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేయడానికి వెళ్లిన వ్యక్తి.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన చెన్నైలోని ముత్యాలపేట (Mutyala Peta)లో జరిగింది. శనివారం ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేసేందుకు వెళ్లిన చందన్ (20) కరెంట్ షాక్ కు గురయ్యాడు. ఏటీఎం వెలుపల ఉన్న ఇనుపరాడ్డుపై చేతులు పెట్టడంతో కరెంట్ షాక్ తగిలింది. దాంతో చందన్ అక్కడికక్కడే కుప్పకూలి వరద నీటిలో పడ్డాడు. ముత్యాలపేటలో వరదనీటిలో కొట్టుకుపోతున్న మృతదేహాన్ని చూసి స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసులు చందన్ మృతదేహాన్ని తీసి.. పోస్టుమార్టంకు పంపారు. అతను ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన యువకుడిగా గుర్తించారు.
చెన్నైలో 34 గంటల వ్యవధిలో చాలా ప్రాంతాల్లో 20 -27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విమానాశ్రయంలోకి నీరు చేరడంతో ఎయిర్ పోర్టు ఇంకా మూతపడే ఉంది. వివిధ సంస్థలకు చెందిన 55 విమానాలు తాత్కాలికంగా రద్దవ్వగా.. మరో 12 విమానాలను దారి మళ్లించారు.