ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన TISS.. 115 మంది తిరిగి జాబుల్లోకి
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (టీఐఎస్ఎస్) గతంలో 115 మందికి పైగా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా వెనక్కి తీసుకుంది
దిశ, నేషనల్ బ్యూరో: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (టీఐఎస్ఎస్) గతంలో 115 మందికి పైగా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా వెనక్కి తీసుకుంది. దీంతో వారు తిరిగి తమ ఉద్యోగాల్లో జాయిన్ కానున్నారు. జీతాల చెల్లింపు సమస్య కారణంగా టీఐఎస్ఎస్ తన నాలుగు క్యాంపస్‌లలోని 55 మంది ఉపాధ్యాయులను, దాదాపు 60 మంది బోధనేతర సిబ్బందిని జూన్ 28న అకస్మాత్తుగా తొలగించింది. ఈ నేపథ్యంలో టీఐఎస్ఎస్ హైదరాబాద్ క్యాంపస్‌తో పాటు ముంబై, తుల్జాపూర్, గౌహతి క్యాంపస్‌లలో టీచింగ్, నాన్ టీచింగ్ కేటగిరీలో 115 మంది ఉద్యోగులను తొలగించారు.
వీరి జీతాల కోసం ప్రతి ఏటా టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి నిధులు విడుదలవుతాయి. అయితే ఈ సారి ఆ నిధులు ఆగిపోవడం వలన జీతాలు చెల్లించలేక వారిని టీఐఎస్ఎస్ ఉద్యోగం నుంచి తొలగించింది. కానీ, తాజాగా వీరికి జీతాలు చెల్లించడానికి కావాల్సిన నిధులను ఇవ్వడానికి టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అంగీకరించింది. ఇప్పుడు తొలగించబడిన వారందరికీ కూడా జీతాలు అందనున్నాయి. దీంతో టీఐఎస్ఎస్ వారందరిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది.
దీనికి సంబంధించి టీఐఎస్ఎస్ తన అధికారిక ప్రకటనలో, జీతాల చెల్లింపుల సమస్యకు సంబంధించిన నిధులను టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అందుబాటులో ఉంచుతుందని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఫలితంగా తొలగించిన ఉద్యోగులను తిరిగి నియమిస్తామని పేర్కొంది.
అంతకుముందు టాటా వంటి సంస్థలో ఉద్యోగులను తొలగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు నిరసనలు చేశాయి. తొలగించబడిన వారంతా కూడా పదేళ్లకు పైగా సంస్థతో అనుబంధం కలిగి ఉన్నారు. ఇప్పుడు తొలగింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.