రామభక్తులు కావాలా.. రామద్రోహులు కావాలా తేల్చుకోండి : సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గోహత్యను ప్రోత్సహించడం, ముస్లిం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మత ప్రాతిపదికన దేశ విభజన కోసం కాంగ్రెస్ నిలబడిందన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాన్ని ‘‘రామద్రోహులు’’గా అభివర్ణించారు. బిహార్ బెగుసరాయ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తరుపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికలు రామ భక్తులు, రామద్రోహులకు మధ్య జరుగుతున్నాయని అన్నారు.
తాను రాముడి జన్మస్థలమైన రాష్ట్రం నుంచి వచ్చానని అన్నారు. సీతా దేవి జన్మస్థలమైన బిహార్ ప్రజల హృదయాల్లో అయోధ్య ఆలయానికి ప్రత్యేక స్థానం ఉందని తెలుసు అని పేర్కొన్నారు. రామద్రోహులు రామ భక్తులపై తూటాలను పేల్చారని.. మాఫియా డాన్ మరణానికి సంతాపం తెలిపారని పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీని దుయ్యబట్టారు. 1980వ దశకంలో ఎస్పీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘కరసేవకుల’పై పోలీసులు కాల్పులు జరపడం గురించి కూడా ప్రస్తావించారు. ఎన్డీయే అధికారం చేపట్టకముందు బిహార్‌లోని అక్రమాలకు ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆఱోపించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు ద్రోహం చేస్తూ ముస్లిం రిజర్వేషన్లను కల్పించి.. దేశాన్ని మతప్రాతిపదికన విభజించేందుకు కాంగ్రెస్ పథకం పన్నిందన్నారు. దళితులు, ఓబీసీలకు కేటాయించాల్సిన కోటాను ముస్లింలకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు.
గోహత్యలను ప్రోత్సహించే వారిని వ్యతిరేకించాలని అన్నారు. ఎన్డీయేకు ఓటేసి ప్రధాని నరేంద్రమోడీకి అధికారం కట్టబెట్టాలన్నారు. మోడీ హయాంలో సరిహద్దుల్లో ఉగ్రవాదం సమస్య సమసిపోయిందన్నారు. భారత్ లో క్రాకర్స్ పేలినా పాక్ సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. భారత్ డిజిటల్ యుగంలోకి ప్రవేశిస్తే.. ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి మళ్లీ లాంతర్ యుగానికి తీసుకెళ్లాలని చూస్తున్నాయని ఆఱోపించారు. యూపీలోని 80 స్థానాల్లో బీజేపీ గెలుపొందుతుందని దీమా వ్యక్తం చేశారు. బిహార్ కూడా ఎన్డీయేకి మెజారిటీ సీట్లు కట్టబెట్టాలని ప్రజల్ని కోరారు.