మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో 7,994 మంది నామినేషన్లు ఖరారు
మహారాష్ట్ర( Maharashtra Assembly ) అసెంబ్లీ ఎన్నికల బరిలో నామినేషన్ల(Nominations) పరిశీలన అనంతరం మొత్తం 288 స్థానాల్లో 7,994 మంది అభ్యర్థుల నామినేషన్లు ఖరారయ్యాయి.
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర( Maharashtra Assembly ) అసెంబ్లీ ఎన్నికల బరిలో నామినేషన్ల(Nominations) పరిశీలన అనంతరం మొత్తం 288 స్థానాల్లో 7,994 మంది అభ్యర్థుల నామినేషన్లు ఖరారయ్యాయి. నవంబర్ 20న ఒకే విడత జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ఆక్టోబర్ 22న ప్రారంభమై 29వ తేదీతో ముగిసింది. 921మంది నామినేషన్లను తిరస్కరించగా, నవంబర్ 4వ తేదీన ఉపసంహరణకు చివరి గడువు కావడంతో నామినేషన్ల సంఖ్య మరికొంత తగ్గనుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో తొలిసారి ఓటర్లు కేవలం 2శాతం మంది మాత్రమే ఉన్నారు. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపుగా 72 లక్షలకు పెరిగిందని, మొత్తం ఓటర్లలో 5 కోట్ల మందికి పైగా పురుషులు కాగా, 4.6 కోట్ల మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 18-19 ఏళ్ల వయసు గల తొలి ఓటర్లు 22.22 లక్షల మంది ఉన్నారని ఎన్నికల సంఘం పేర్కొంది. శతాధిక వృద్ధులు 21,089 మంది ఉన్నారని పేర్కొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆధికార బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి ప్రభుత్వం, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ)లతో కూడిన మహావికాస్ అఘాడీ కూటమి విజయం కోసం హోరాహోరిగా తలపడుతున్నాయి.